Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్‌సభలో 10 నిమిషాల వ్యవధిలో 14 బిల్లులు ఆమోదం
- పడిపోయిన చర్చా సమయం
న్యూఢిల్లీ : తాజా వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించుకున్న తీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. సమగ్రమైన చర్చ లేకుండా మోడీ సర్కార్ బిల్లును ఆమోదించుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల సమావేశాల్లో చర్చ అనేది లేకుండా నిమిషాల వ్యవధిలోనే మోడీ సర్కార్ బిల్లులను పాస్ చేసుకున్నది. లోక్‌సభలో 10 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో అలా 14 బిల్లులు ఆమోదం పొందాయి. పైగా, తదుపరి పరిశీలన కోసం ఒక్క బిల్లును కూడా లోక్‌సభ సెలెక్ట్ కమిటీకి పంపలేదు. ఇలా గత 22 పార్లమెంట్ సెషన్స్‌లో చోటుచేసుకోకపోవడం గమనార్హం. 15వ లోక్‌సభ (2009-14) సమయంలో 71 శాతం బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపగా, 17వ లోక్‌సభ (2019 నుంచి) మొత్తం సెషన్స్‌లో కేవలం 12 శాతం బిల్లును మాత్రమే కమిటీకి సిఫారసు చేశారు. అదేవిధంగా తాజాగా జరిగిన 17వ లోక్‌సభ 6వ సెషన్లో పలు అంశాలకు సంబంధించి ప్రతిపక్షాల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో ఏర్పడిన అంతరాయాల కారణంగా లోక్‌సభ 74.46 పనిగంటలను నష్టపోయింది.తాజా లోక్‌సభ సమావేశాల్లో 10 నిమిషాల కంటే తక్కువ చర్చ సమయంతో 14 బిల్లులను ఆమోదించుకోగా, 2014 నుంచి మిగతా 22 సెషన్లలో అలా 12 బిల్లులు మాత్రమే పాసయ్యాయి. 2019లో ఒక బిల్లుపై సగటు చర్చా సమయం 213 నిమిషాలు ఉండగా, 2021లో అది 85 నిమిషాలకు పడిపోయింది. 14, 15వ లోక్‌సభ సమావేశాల్లో సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లుల శాతం వరుసగా 60, 71 శాతం ఉండగా, బిజెపి హయాంలోని 16, 17 లోక్‌సభ సెషన్స్‌లో అది కేవలం 27, 12 శాతం మాత్రమే ఉంది. ఒకే సెషన్లో ప్రవేశపెట్టిన బిల్లులన్నింటినీ 100 శాతం ఆమోదించుకోవడం తాజా సెషన్లో జరిగింది. 15వ లోక్‌సభ సమయంలో ఇలా కేవలం 18 శాతం మాత్రమే ఉండగా, 16వ లోక్‌సభలో 33 శాతం, 17వ లోక్‌సభకు వచ్చేసరికి 70 శాతానికి పెరిగింది.