Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి సుప్రీం సూటి ప్రశ్న.. పెగాసస్‌పై సర్కారుకు నోటీసులు
న్యూఢిల్లీ : పెగాసస్ నిఘాపై కేంద్రం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మంగళవారం సూటి ప్రశ్నలు వేసింది. దేశ భద్రత విషయంలో రాజీపడాలని ప్రభుత్వంపై ఎంతమాత్రం బలవంతం చేయబోమని, అందుకు తాము పూర్తిగా విముఖమని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వ అనుమతితోనే ఈ దేశ పౌరుల ఫోన్లపై నిఘా జరిగిందని వస్తున్న ఆరోపణలపై మాత్రమే స్పష్టమైన సమాచారాన్ని తాము కోరుతున్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పెగాసస్ నిఘా ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. 10 రోజుల తర్వాత కేసు విచారణను జాబితా చేసిన న్యాయస్థానం.. నిఘా ఆరోపణలపై తగిన కాలపరిమితితో విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు తదుపరి కార్యాచరణను పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొన్నారు. ''ఒక న్యాయస్థానంగా మేం మన దేశ భద్రత లేదా దేశ రక్షణ విషయంలో రాజీపడాలనుకోవడం లేదు. ఇక్కడ సమస్య భిన్నంగా ఉన్నది. ప్రజలు తమ ఫోన్లను హ్యాక్ చేశారని ఆరోపిస్తున్నారు. పౌరుల విషయంలో కూడా నిఘాకు సంబంధిత అధికార యంత్రాంగం అనుమతితో మాత్రమే నిబంధనలు ఉంటాయి. మీరు దేశ భద్రతకు సంబంధించి చెప్పాలని మేం అడగట్లేదు. నిబంధనల ప్రకారం ఎంత సమాచారం మేరకు బహిర్గతం చేయాలో సంబంధిత అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకునేందుకు మేం ఒక సాధారణ నోటీసు ఇస్తున్నాం. తర్వాత ఏమి చేయాలో మేం నిర్ణయిస్తాం' అని పేర్కొంది.
అంతకుముందు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఉపయోగించిన ఏదైనా సాఫ్ట్వేర్ల గురించి వెల్లడిస్తే అది జాతీయ భద్రతకు హాని కలిగిస్తుందని మెహతా వాదించారు. ''పెగాసస్ ఉపయోగించారో లేదో చెప్పాలని పిటిషన్‌దారులు కోరుతున్నారు. సాఫ్ట్వేర్లు ఉపయోగించబడతాయి. ఏ సాఫ్ట్వేర్ ఉపయోగించారో వారు తెలుసుకోవాలనుకుంటున్నారు! అయితే ఏ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారో ఏ ప్రభుత్వం చెప్పదు. ఎందుకంటే ఆ విషయాన్ని వెల్లడిస్తే ఉగ్రవాదులు అప్రమత్తమయ్యే అవకాశం ఉంది. ఇదంతా జాతీయ భద్రతకు సంబంధించినది. ఈ విషయాలు బహిరంగ చర్చకు సంబంధించి కాదు'' మెహతా పేర్కొన్నారు. ఎవరికీ, ఏమీ వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం లేదని, అయితే 'బహిరంగంగా వెల్లడించలేమని చెబుతున్నాం' అని అన్నారు. పెగాసస్ నిఘా ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని అఫిడవిట్లో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కమిటీ ఏర్పాటుకు అనుమతిస్తే.. కమిటీ ముందు అన్ని విషయాలను వెల్లడించి దాని నివేదికను సుప్రీంకోర్టు ముందుకు తెస్తామని తెలిపారు. దేశ భద్రతకు సంబంధించి ఎటువంటి సమాచారం తాము కోరడం లేదని పిటిషన్‌దారుల తరపు న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. పెగాసస్‌ను వినియోగించి జరిగిన నిఘాకు ప్రభుత్వ అనుమతి ఉందా లేదా? అనేదానికి మాత్రమే తెలుసుకోవాలని అనుకుంటు న్నామని స్పష్టం చేశారు. ఈ పాయింట్‌పై కొంత సమయం తమలో తాము చర్చింకున్న తర్వాత ధర్మాసనంలోని న్యాయమూర్తులు కేంద్రానికి నోటీసులు జారీచేశారు. జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు, అసమ్మతివాదులు, రాజకీయ నాయకులు, మంత్రులు, ఇతర పౌరులపై నిఘా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్‌ను వినియోగించిందని ఆరోపిస్తూ, దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. నిఘా ఆరోపణలు తిరస్కరిస్తూ కేంద్రం తరపున సోమవారం దాఖలు చేసిన అఫిడవిట్‌పైనే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నిలబడిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా నోటీసులు జారీచేసింది.