Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మానవ హక్కుల సమస్యలను విభిన్న కోణాల్లో చూసేందుకు దారి తీసిందని మానవ హక్కుల కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ అన్నారు. కోవిడ్-19 కారణంగా మహిళలపై పెరుగుతున్న గృహహింసకు సంబంధిచిన అంశాలను ఆమె ప్రస్తావించారు. ఆమె రాసిన కథనంలోని అంశాల ప్రకారం.. దేశానికి స్వతంత్య్రం వచ్చిన 60 ఏండ్ల తర్వాత మహిళలపై హింసకు నిర్వచనం రావడం విడ్డూరం. గృహహింసకు సంబంధించిన చట్టం 2005లో వచ్చింది. దీనిలో విప్లవాత్మక విషయాలు ప్రస్తావించారు. కేవలం శారీరక హింసనే కాకుండా ఆర్థిక, లైంగిక, భావోద్వేగ అంశాలను సైతం ఈ చట్టంలో ప్రస్తావించారు. అయితే, లాక్డౌన్, కరోనా సమయంలో గృహహింస తీవ్రతరమైంది. బాధితులకు న్యాయం అందే విషయంలోనూ అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి. 2012లో అతి భయంకరమైన నిర్భయ లైంగికదాడి అనంతరం కేంద్రం లైంగికదాడి బాధితులు, మహిళల రక్షణ కోసం నిధిని.. జిల్లాకో కేంద్రాన్ని (వన్‌స్టాప్ క్రైసిస్ సెంటర్) ఏర్పాటుచేసి, నిధులు కేటాయిస్తున్నది. ఇటీవల మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. లైంగిక వేధింపు బాధితులకు రక్షణ, పునరావాస కార్యక్రమాల కోసం కేటాయించిన నిధుల వినియోగం అంతంత మాత్రమేనని తెలుస్తోంది. 2019 లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వన్‌స్టాప్ సెంటర్లకు రూ.322.14 కోట్ల కేటాయించారు. ఇందులో కేవలం రూ.42.98 కోట్లు వినియోగించబడ్డాయి. 2020లో లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. సవన్స్టాప్ సెంటర్ కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మంజూరు చేసిన మొత్తం రూ.218.59 కోట్లు. ఇందులో 53.99 కోట్లు ఉపయోగించబడ్డాయి. ఈ వ్యవస్థ మెరుగైన పనితీరును కనబర్చకపోయినా.. మహిళల రక్షణకు స్వయం సహాయక వ్యవస్థను సృష్టించడంలో ఒక ప్రారంభంగా చెప్పుకోవచ్చు. అయితే, దీని పనితీరును మెరుగుపర్చడానికి కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక అధికారులను నియమించి మంచి ఫలితాలను రాబట్టాయి. ప్రభుత్వాలు ఈ విషయంలో మరింతగా పనిచేయాల్సి ఉంది.