Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారిక లెక్కల కంటే 27 రెట్లు అధికం..
- రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో డెత్స్ డేటా విశ్లేషించిన రిపోర్టర్స్ కలెక్టివ్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పరిస్థితులపై దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సరైన వివరాలు వెల్లడించడం లేదని ఆరోపణలున్నాయి. గుజరాత్ సర్కారుపై అక్కడి కరోనా పరిస్థితిపై తీసుకుంటున్న చర్యలు, మరణాలు, కేసులు విషయంలో వాస్తవ విషయాలు వెల్లడించడం లేదని స్థానిక మీడియాతో పాటు అనేక మంది సామాజిక కార్యకర్తలు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు సైతం ప్రభుత్వ తీరుపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ.. గుజరాత్ కరోనా నిర్వహణలో మెరుగైన పనితీరు కనబరుస్తున్నదని ప్రధాని మోడీ పలుమార్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 16 రాష్ట్ర 10:49 గంటల నాటికి 10,075 మంది కరోనాతో చనిపోయారని తెలిపింది. అయితే, ప్రభుత్వం తెలిపిన అధికారిక మరణాలు కంటే రాష్ట్రంలో 27 రెట్లు అధిక మరణాలు.. దాదాపు 2.81 లక్షల మరణలు సంభవించాయని తాజాగా అక్కడి మున్సిపాలిటీల నుంచి సేకరించిన మరణాల డేటా అంచనాల ద్వారా తెలుస్తోంది.
గుజరాత్లో కరోనా మరణాలు తీవ్ర స్థాయిలో ఉండి.. శ్మశానవాటికల్లో నెలల తరబడి నిత్యం గరిష్ట స్థాయిలో దహన సంస్కారాలు నిర్వహించారు. మృతదేహాలు అధికంగా ఉండటంతో వాటిని ముస్లిం శ్మాశాన వాటికల్లో ఖననం చేయడంతో పాటు పొరుగు గ్రామీణ ప్రాంతాలకు తరలించారు. అయితే, పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న మరణాలు అధికంగా ఉన్న నేపథ్యంలో వాస్తవ విషయాలు తెలుసుకోవడానికి రాష్ట్రంలోని మొత్తం 170 మన్సిపాలిటీల్లో 68 మున్సిపాలిటీల నుంచి మరణ రిజిస్టర్ల కాపీలను రిపోర్టర్స్ కలెక్టివ్ సంపాదించగలిగింది. వీటిలోనే మొదట అధికారులు మరణాలను నమోదుచేశారు. వీటి విశ్లేషణ అనంతరం.. 2019 జనవరి నుంచి 2021 ఏప్రిల్ వరకు ఉన్న ఈ మరణ రిజిస్టర్ల ప్రకారం.. 68 మున్సిపాలిటీల్లోనే 2020 మార్చి నుంచి ఏప్రిల్ 2021 మధ్య కాలంలో 16,892 మరణాలు నమోదయ్యాయి. 2021 ఒక్క ఏప్రిల్ నెలలోనే 12,757 మంది చనిపోయినట్టు రికార్డుల్లో ఉంది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 10,238 మరణాలు అధికం. రాష్ట్ర మొత్తం జనాభాలో (6.03 కోట్లు)లో కేవలం 6 శాతం మాత్రమే ఈ 68 మున్సిపాలిటీల్లో ఉన్నారు. ఈ గణాంకాలతో పోలిస్తే రాష్ట్రంలో అధికారికంగా వెల్లడించిన మరణాలు కంటే 27 రెట్లు అధిక కోవిడ్ మరణాలు సంభవించాయి. అంటే దాదాపు 2.81 లక్షల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
హార్వర్డ్ టి.హెచ్.చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కరోలిన్ బక్కీ ది రిపోర్టర్స్ కలెక్టివ్‌తో మాట్లాడుతూ.. ''ఈ మున్సిపాలిటీల నుండి అదనపు మరణ గణనలు సంబంధిత అధికారిక కోవిడ్-19 మరణ గణనలు కోవిడ్-19 మరణాలలో అధిక భాగాన్ని కోల్పోతున్నట్టు సూచిస్తున్నాయి'' అని అన్నారు. ఇక మున్సిపాలిటీల నుంచి గ్రామీణ ప్రాంతాల డేటా మినాహాయించబడుతుంది. కాబట్టి పట్టణాలతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య ప్రాప్యత తక్కువగా ఉంటుంది. కాబట్టి మరణాలు అధికారిక లేక్కలు.. ప్రస్తుత అంచనాలు మించి ఉంటాయని పేర్కొన్నారు.