Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వేచ్ఛను కల్పించాల్సిందే.. ఈసీ, కాగ్ మాదిరి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించండి : కేంద్రానికి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు
చెన్నై: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐ పరిస్థితి పంజరంలో రామచిలుకలా మారిపోయింది అంటూ వ్యాఖ్యానించింది. సీబీఐని వెంటనే పంజరం నుంచి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత కొంత కాలం నుంచి సీబీఐ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలా మారిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయన్న అంశాలను ప్రస్తావించింది. ఎన్నికల సంఘం (ఈసీ), కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మాదిరిగానే సీబీఐ కూడా స్వతంత్ర సంస్థలా ఉండాలనీ, అది కేవలం పార్లమెంట్‌కే రిపోర్ట్ చేయాలని సూచించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ పార్లమెంటుకు మాత్రమే నివేదించే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండాలని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
తమిళనాడులో జరిగిన 'పోంజీ' స్కామ్ పై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్ పై న్యాయమూర్తులు జస్టిస్ ఎన్. కిరుబాకరన్, జస్టిస్ బి. పుగళెందిల ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం పై వ్యాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి 12 అంశాలతో కూడిన సూచనలు చేసింది. అందులో సీబీఐకీ చట్టబద్ద హౌదా ఇస్తూ.. స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని ఆదేశించింది. వీలైనంత త్వరగా సీబీఐ అధికారాలు, పరిధులు పెంచి.. సంస్థకు చట్టబద్ధ హౌదా ఇచ్చేలా ఓ చట్టాన్ని తీసుకురావాలని తెలిపింది.