Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివిధ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రుల అడ్డగింత
- కర్నాటక, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో మంత్రులకు వ్యతిరేకంగా నిరసనలు
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రులకు రైతుల సెగ తగిలింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులను రైతులు అడ్డుకుంటున్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కర్నాటకలోని మైసూర్లో జన్ ఆశ్వీర్వాద్ యాత్రలో పాల్గొనడానికి అక్కడికి వెళ్లిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఆమె రైతు వ్యతిరేక ప్రకటనలపై ఆగ్రహించిన రైతులు ఆమెను అడ్డుకున్నారు. కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలుచేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న వారు నిజమైన రైతులు కాదనీ, కమీషన్ ఏజెంట్లని ఆమె ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్తరాఖండ్‌లోని ఉదంసింగ్ నగర్లో జన్ ఆశీర్వాద్ యాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన కేంద్ర రక్షణ, పర్యాటక శాఖ సహాయ మంత్రి అజరు భట్ కూడా రైతుల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్లో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బాల్యాన్కు వ్యతిరేకంగా రైతు నేత రాకేష్ తికాయిత్ అల్టిమేటం జారీ చేశారు. రైతు సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే, ఆయనను ప్రాంతంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దు ప్రాంతాల్లో రైతుల ఆందోళన కొనసాగుతున్నది. బుధవారం నాటికి రైతు ఉద్యమం 265వ రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజహాన్‌పూర్, పల్వాల్ సరిహద్దుల్లో రైతులు ఆందోళన జోరు వర్షంలోనూ కొనసాగుతున్నది. కొనసాగుతున్న నిరసనలను బలోపేతం చేయడానికి, సుదూర ప్రాంతాల నుంచి రైతులు ఆందోళన ప్రాంతాలకు చేరుతున్నారు. హర్యానా గ్రామాల నుంచి యువకులు టిక్రి, సింఘూ సరిహద్దుల వద్ద జరుగుతున్న ఆందోళనల తరలివస్తున్నారు. తమ గ్రామాల నుంచి మట్టి, నీటిని ఆందోళన ప్రదేశాలకు తీసుకువస్తున్నారు. తాజాగా హర్యానాలోని ఫోగట్ ఖాప్ నుంచి 75 మంది యువకులు టిక్రి సరిహద్దుకు చేరుకున్నారు. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఎక్కడిక్కడే ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీజేపీ, దాని అనుబంధ పార్టీల నేతల బహిష్కరణలు కొనసాగుతున్నాయి. సింఘూ సరిహద్దు వద్ద ఈ నెల 26, 27 తేదీల్లో జాతీయ కన్వెన్షన్ జరుగుతున్నది. ఈ సమావేశాల్లో దాదాపు 1500 మంది ప్రతినిధులు హాజరవుతారు. ఈ కన్వెన్షన్ దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉండగా మిషన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భాగంగా ముజఫర్‌నగర్‌లో సెప్టెంబర్ 5న మహా పంచాయతీకి సన్నాహాలు జరుగుతున్నాయి. సమీకరణ సమావేశాలు తూర్పు ఉత్తరప్రదేశ్‌తో సహా వివిధ ప్రదేశాలలో జరుగుతున్నాయి.