Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకు ముగ్గురు మహిళా న్యాయమూర్తులు
- తొలిసారి మహిళలకు అధిక ప్రాధాన్యత
- సర్వోన్నత న్యాయస్థానానికి తెలుగు వ్యక్తి
- తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు
- జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. కొలీజియం సిఫారసుల్లో తొలిసారి మహిళలకు అధిక ప్రాధన్యత లభించింది. ఈసారి కొలీజియం సిఫార్సు చేసిన వారిలో అత్యధికంగా ముగ్గురు మహిళలున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని కష్ణా జిల్లాకు చెందిన పిఎస్ నరసింహను కొలీజియం సిఫార్స్ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలో జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఎఎం ఖన్విల్కార్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం అత్యున్నత న్యాయస్థానానికి కొత్తగా తొమ్మిది మంది న్యాయమూర్తులను నియమించేందుకు బుధవారం సిఫారసు చేసింది. 2019 మార్చి 19న అప్పటి సీజేఐ రంజన్ గొగోరు పదవీ విరమణ తరువాత ఎలాంటి అపాయింట్మెంట్ జరగలేదు. ఇప్పుడు మళ్లీ భారీస్థాయిలో కొలీజియం సిఫారసు చేసింది.
21 నెలల తరువాత తొలి కొలీజియం సమావేశం ఇదే. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా, ఇటీవలి జస్టిస్ నారీమన్, నవీన్ సిన్హా పదవీ విరమణతో 24 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు తొమ్మిది మంది నియామకం అయితే, ఒక న్యాయమూర్తి పోస్టు ఖాళీ ఉంటుంది.
జస్టిస్ బివి నాగరత్న, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పిఎస్ నరసింహ, జస్టిస్ అభరు శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ సిటి రవి కుమార్, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ హిమా కొహ్లీ, జస్టిస్ బేలా ఎం. త్రివేది తదితరులను కొలీజియం సిఫారసు చేసింది.
ముగ్గురు మహిళలు
ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సిఫారసు చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కొహ్లీ, కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేల త్రివేది ఉన్నారు. అలాగే సుప్రీంకోర్టు బార్ నుంచి తెలుగు న్యాయవాది జస్టిస్ పిఎస్ నరసింహ, కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎఎస్ అభరు శ్రీనివాస్, విక్రమ్నాగ్ కూడా కొలీజియం సిఫార్స్ చేసిన వారిలో ఉన్నారు. వారిలో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎఎస్ అభరు శ్రీనివాస్ ఓకా, పిఎస్ నరసింహ 2027లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అయ్యేందుకు అవకాశాలున్నాయి.
ఎన్నో ఏళ్ల డిమాండ్ నేరవేరనుందా..?
జస్టిస్ బివి నాగరత్న 2008లో కర్నాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. బివి నాగరత్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తే.. అది దేశ న్యాయ చరిత్రలో చారిత్రాత్మక క్షణంగా నిలుస్తుంది. నాగరత్నం తండ్రి ఈఎస్ వెంకటరామయ్య గతంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన జూన్ 1989 నుంచి డిసెంబర్ 1989 మధ్య దేశ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. దేశానికి ఒక మహిళా ప్రధాన న్యాయమూర్తి కావాలనే డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో జస్టిస్ బివి నాగరత్నను ఆ పదవి వరిస్తే.. ఈ సంఘటన చరిత్రలో నిలిచిపోతుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కూడా మహిళ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాలని అభిప్రాయపడ్డారు. గతంలో ''దేశంలో ప్రధాన న్యాయమూర్తి పదవిని ఒక మహిళ చేపేట్టే సమయం ఆసన్నమైంది'' అని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బాబ్డే, జస్టిస్ నారీమన్ అన్న వ్యాఖ్యలు నిజం అయ్యే సమయం ఆసన్నం అవ్వనుంది.
న్యాయ వ్యవస్థలో మహిళలు
దేశంలో 1950లో సుప్రీం కోర్టు ఏర్పాటు అయింది. అంతకుముందు 1935 నుంచి ఉన్న ఫెడరల్ కోర్టు స్థానంలో సుప్రీం కోర్టు వచ్చింది. అప్పటి నుంచి 47మంది సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించారు. 1990లో కొలిజియం వ్యవస్థ వచ్చింది. తొలిగా ఎపెక్స్ కోర్టులో ఎనిమిది మంది జడ్జిలు మాత్రమే ఉండేవారు. అయితే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారాన్ని రాజ్యాంగం, పార్లమెంటుకు ఇచ్చింది. ఇప్పటివరకూ కేవలం ఎనిమిది మంది మహిళలు మాత్రమే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. 1989లో తొలిసారిగా జస్టిస్ ఫాతిమా బివి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం 34 మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులలో జస్టిస్ ఇందిరా బెనర్జీ ఒక్కరే మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. ప్రస్తుతం కొలీజియం ముగ్గురు న్యాయమూర్తులను సిఫారసు చేసింది. దీంతో నలుగురు మహిళ న్యాయమూర్తులు కానున్నారు. అయితే జస్టిస్ ఇందిరా బెనర్జీ 2022 సెప్టెంబర్లో పదవీ విరమణ చేయబోతున్నారు. అలాగే ప్రస్తుతం దేశంలో ఉన్న 25 హైకోర్టులలో కేవలం ఒక్క కోర్టులో మాత్రమే మహిళా ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. ఆమె తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ. ఇప్పుడు ఆమె సుప్రీం కోర్టుకు వెళ్తే. ఒక్క రాష్ట్రానికి కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహిళ ఉండదు. దేశవ్యాప్తంగా ఉన్న 661 మంది హైకోర్టు న్యాయమూర్తుల్లో కేవలం 73 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. మణిపూర్, మేఘాలయ, పట్నా, త్రిపుర, ఉత్తరాఖండ్ హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి కూడా లేరు.
తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు
తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులను సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అందులో పి. శ్రీసుధ, సి.సుమలత, జి.రాధారాణి, ఎం.లక్ష్మణ్, ఎన్.తుకరాంజీ, ఎ.వెంకటేశ్వర రెడ్డిలు ఉన్నారు. జ్యూడిషల్ మెంబర్గా పి.మాధవి దేవిని సిఫారసు చేశారు.