Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అధికారి మృతి
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్‌లో గురువారం జరిగిన ఎన్కౌంటర్ సందర్భంగా ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అధికారి ఒకరు మరణించారు. రాజౌరి జిల్లాలోని ఠాణామండీ ప్రాంతంలో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి(జెసిఓ) మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయని ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది సైతం హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన జెసిఓను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో చనిపోయారని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతాదళాలు శోదాలు చేపట్టాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం కార్యోట్ కలాస్ ప్రాంతంలో వారు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయని సంబంధిత అధికారులు వివరించారు. ఉగ్రవాదులంతా సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్‌ఎసి) దాటి రాజౌరి జిల్లాలోని చొరబడ్డారని తెలిపారు. ఆ ప్రాంతంలో ఎంతమంది ఉగ్రవాదులు దాగివున్నారన్న దానిపై స్పష్టత లేదని, ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.