Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిటిషన్‌పై కేంద్రం, గూగుల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : గతంలో తమపై దాఖలైన క్రిమినల్ కేసుకు సంబంధించి పలు ఆన్లైన్ వేదికలపై ఉన్న కథనాలను తొలగించాలని, తద్వారా ఆ విషయాలను 'మర్చిపోయే హక్కు'ను ప్రసాదించాలని కోరుతూ ఇద్దరు వ్యాపారవేత్తలు దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కేంద్ర కమ్యూనికేషన్, ఐటి మంత్రిత్వ శాఖతో పాటు, సెర్చ్ఇంజన్ దిగ్గజం గూగుల్‌కు తాజాగా నోటీసులు జారీచేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంలో వ్యాపారవేత్తలకు మధ్యంతర ఉపశమనం కలిగించేందుకు తిరస్కరించిన న్యాయమూర్తి జస్టిస్ రేఖాపల్లి.. '' మీకు ఖచ్చితంగా గోప్యతా హక్కు ఉంది. అయితే దాన్ని ఏవిధంగా సమతుల్యం చేయాలో చూడాల్సి ఉంది'' అని పిటిషన్‌దారులకు తెలిపింది. ఈ కేసుపై తదుపరి విచారణను అక్టోబర్ 28కి వాయిదా వేసింది. ఎన్ఆర్ఐ, వ్యాపారవేత్త అయిన జైదీప్ మిర్చాందాని, సిరాజ్ అమని ఈ సంయుక్త పిటిషన్ దాఖలు చేశారు. 2002లో తమపై నమోదైన కేసుకు సంబంధించి ఆన్లైన్లో వచ్చిన కథనాలను చూసి తాము చాలా బాధ పడ్డామని, ఈ కేసులో న్యాయస్థానం తమను 2016లో నిర్ధోషులుగా ప్రకటించిందని తెలిపారు. అయితే ఆన్లైన్లో ఇప్పటికీ ఉన్న ఆరోపణలు, తప్పుడు సమాచారం తమను ఇంకా వెంటాడుతోందని అన్నారు. ఇది తమ ఉపాధి, కెరీర్ అవకాశాలతో పాటు వ్యక్తిగత, సామాజిక జీవితంపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కోర్టు తమను నిర్ధోషులుగా ప్రకటించినప్పటికీ, ఆన్లైన్లో కథనాలను చేసిన వారు తమను ఇంకా నేరస్తులుగా చూస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కేసు వాస్తవాలు, తదనంతర పరిస్థితుల నేపథ్యంలో తమకు సంబంధించి ఆన్లైన్లో ఉన్న అన్ని లింకులను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌దారులు కోర్టును కోరారు.