Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతాంతర వివాహాలకు సంబంధించిన పలు సెక్షన్లు వివాదాస్పదం
గాంధీనగర్: ఇటీవల రాష్ట్ర సీఎం విజరు రూపానీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన 'గుజరాత్ మత స్వేచ్ఛ సవరణ చట్టం-2021'లోని పలు సెక్షన్ల అమలను నిలిపివేస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పదంగా ఉన్న మతాంతర వివాహాలకు సంబంధించిన పలు సెక్షన్ల అమలును నిలిపేస్తూ గురువారం తాత్కాలిక ఆదేశాలను జారీ చేసింది. నిర్బంధం, ఒత్తిడి లేదా దురాశతో వివాహం జరిగినట్టు రుజువయ్యే వరకు ఈ చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ను నమోదు చేయరాదని పేర్కొంది. ఈ చట్టం ప్రకారం మతాంతర వివాహం జరిగినపుడు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చుననీ, ఆ వివాహం నేరపూరితమైందని ఆరోపించ వచ్చని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. మత స్వేచ్ఛ చట్ట నిబంధనలకు పిటిషనర్ ఇచ్చిన వివరణ సరైంది కాదనీ, తప్పుడు పద్ధతుల్లో బెదిరించి పెండ్లి చేసుకున్నవారు మాత్రమే భయపడవలసి ఉంటుందని ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ కమల్ త్రివేది కోర్టుకు తెలిపారు. అయితే, ఈ చట్టం ప్రకారం అనేక ఫిర్యాదులు నమోదవుతున్నాయనీ, పోలీసు అధికారులు దీనిని ఏ విధంగా అర్థం చేసుకునీ, వివరిస్తారో పరిశీలించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. గుజరాత్ మత స్వేచ్ఛ సవరణ చట్టం-2021 లోని పలు సెక్షన్లకు జరిగిన సవరణల అమలుపై ఆంక్షలు విధించింది. మతాంతర వివాహాలకు సంబంధించిన కేసుల్లో కేవలం వివాహం ప్రాతిపదికపైనే ఎఫ్ఐఆర్లను నమోదు చేయవద్దని తెలిపింది. కాగా, లవ్ జిహాద్ నేపథ్యంలో పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇటువంటి చట్టాలను తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే గుజరాత్ సైతం ఈ ఏడాది ఏప్రిల్లో మత స్వేచ్ఛ చట్టం-2021ని ఆమోదించింది.