Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నదాతలకు గాయాలు
- వేదిక, టెంట్ ధ్వంసం
- బ్యానర్లు చించివేత
- ఆహార పదార్ధాలు, వంట పాత్రలు చెల్లాచెదురు
- పల్వాల్ సరిహద్దులో ఘటన
- ఎస్కేఎం ఖండన
న్యూఢిల్లీ : రైతులపై ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు మరోసారి దాడికి తెగబడ్డారు. ఆ దాడిలో ముగ్గురు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. రైతుల ఆందోళన వేదికను, టెంట్‌ను ధ్వంసం చేశారు. బ్యానర్లును చించేశారు. ఆహార పదార్థాలు, వంట పాత్రలు చెల్లాచెదురు చేశారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దు పల్వాల్ ప్రాంతంలోని రైతుల ఆందోళన వేదిక వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది. ఇక్కడ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానాకు చెందిన రైతులు ఆందోళన చేస్తున్నారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. రైతులపై దాదాపు 10 నుంచి 15 మంది వరకు గుంపు దాడికి ఒడిగట్టారు. అక్కడ నుంచి వెళ్లిపోవాలని రైతులను కర్రలతో కొడుతూ, పిడిగుద్దులు గుద్దారు. దీంతో ముగ్గురు రైతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మోర్చా పండాల్‌ను ధ్వంసం చేశారు. మోర్చాలో ఉన్న రైతు నాయకులపై దాడి చేశారు. లంగర్‌లోని కిచెన్ వాలంటీర్లపైనా దాడికి తెగబడ్డారు. కొన్ని టెంట్లకు నిప్పుపెట్టేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకోవడంతో ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు పారిపోయారు. వేలాది మంది రైతులు స్థానిక ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎస్పీ జోక్యం చేసుకొని రెండు, మూడురోజుల్లో నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్పీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కాగా, ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు బాదల్ సరోజ్, ఎన్‌కె శుక్లా పల్వాల్ రైతు ఆందోళన ప్రాంతాన్ని సందర్శించి.. అక్కడ రైతులతో మాట్లాడారు. పల్వాల్ సరిహద్దు వద్ద జరుగుతున్న రైతు ఉద్యమంపై ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తల ఇలా దాడికి తెగబడటం ఇది రెండోసారనీ, గతంలో జనవరి 26 తరువాత దాడి చేశారని బాదల్ సరోజ్ మీడియాకు తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణ శాఖ సహాయ మంత్రి కష్ణపాల్ సింగ్ సజ్జ నార్ అనుయాయులే ఈ దాడి చేశారని అన్నారు. అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని విమర్శించారు. దానికి ఎస్కేఎం తీవ్రంగా ఖండించింది. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.