Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొహర్రం ఊరేగింపు కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులు
- పోలీసుల దాడి ఫొటోలు, వీడియోలు వైరల్.. జమ్మూకాశ్మీర్‌లో ఘటన
న్యూఢిల్లీ: జర్నలిస్టులపై పోలీసులు రెచ్చిపోయారు. లాఠీలు, కర్రలతో విరుచుపడుతూ.. తుపాకులు చూపిస్తూ కాల్చేంత పనిచేశారు. మొహర్రం ఊరేగింపునకు సంబంధించిన కవరేజీ కోసం వెళ్లిన జర్నలిస్టులుపై పోలీసులు రెచ్చిపోయి దాడి చేసిన ఘటన జమ్మూకాశ్మీర్‌లో చోటుచేసుకుంది. వివిధ ప్రాంతాల్లో మొహర్రం కవరేజీకి వెళ్లిన దాదాపు 10 మంది జర్నలిస్టులపై ఖాకీలు లాఠీలతో దాడి చేశారు. శ్రీనగర్‌లో స్టేషన్ హెడ్ ఆఫీసర్.. కవరేజీకి వెళ్లిన హిందూస్థాన్ టైమ్స్ జర్నలిస్టు వసీం ఆంద్రాబీతో వాగ్వాదానికి దిగి అడ్డుకున్నాడు. దీనిని గమనించిన భట్ బుర్హాన్ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్చదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ క్రమంలో పోలీసులు అరుస్తూ.. బుర్హాన్‌పై లాఠీలతో విరుచుకుపడ్డారు. మరో జర్నలిస్టు సాజిద్ హమీద్‌పై కూడా పోలీసులు దాడిచేశారు. హమీద్ దివైర్తో మాట్లాడుతూ.. పోలీసులు దాడి చేయడంతో తన 60డీ కెమెరా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. మొదట పోలీసులు తనను తన్నారనీ, ఆపై దూషిస్తూ.. దాడి చేశారని చెప్పారు.
మరో జర్నలిస్టు చెప్పిన వివరాల ప్రకారం.. పోలీసులు వారిపై దాడి చేయడానికి అరుస్తూ.. తుపాకులతో పరుగెత్తుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో బీబీసీ ఊర్ధు ఫొటో జర్నలిస్టు షఫత్ ఫరూక్ అక్కడే నేలపై కూర్చుని పోలీసుల తీరుపై నిరసన తెలిపాడు. ఈ క్రమంలో మరికొంద మంది జర్నలిస్టులు అక్కడి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఫ్రీప్రెస్ జర్నల్‌లో ఫ్రీలాన్స్ రిపోర్టర్ అయిన హమీద్ మాట్లా డుతూ.. పోలీసులు తమపై దాడి చేయడం ఇదే మొదటిసారి కాదనీ, ఇంతకు ముందు కూడా ఇలా జరిగిందని తెలిపారు. జర్నలిస్టులపై పోలీసుల దాడులు వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతు న్నాయి. జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తూ.. అంతర్జాతీయ మీడియా వాచ్డాగ్ కమిటీ (సీపీజే) ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలనీ, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాన్ని కోరింది. ''జమ్మూకాశ్మీర్ పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కేవలం తమ ఉద్యోగ బాధ్యతను నిర్వహిస్తున్న జర్నలిస్టులపై దాడి చేశారు. వారిపై కుట్రపూరిత నేరాలు మోపుతున్నారు'' అని స్టీవెన్ బట్లర్ (సీపీజే ఆసియా ప్రోగ్రామ్ కోఆర్డి నేటర్) అన్నారు. కాశ్మీర్ ప్రెస్‌క్లబ్ సైతం ఈ దాడిని ఖండించింది. రాజ్యాంగం ప్రకారం ప్రెస్ స్వేచ్ఛను పోలీసులు గౌరవించాలని పేర్కొంది. కాగా, జర్నలిస్టులపై దాడికి పాల్పడిన ఎస్ఎహెచ్వోతో పాటు ఆరుగురు పోలీసులను బుధవారం బదిలీ చేశారు.