Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచాన్ని కుదిపేస్తున్న అఫ్ఘాన్ సంక్షోభం
- తాలిబాన్లకు ఆయుధాలిచ్చి పెంచి పోషించింది అమెరికానే : రాజకీయ విశ్లేషకులు
- కుట్రలు, కుతంత్రాల్ని నమ్ముకున్నారు కాబట్టే..ఇలా ముగిసింది
న్యూఢిల్లీ : అఫ్ఘనిస్థాన్ తాలిబాన్ల చేతిలోకి వెళ్లటం..అనంతర పరిణామాలు ప్రపంచ దేశాల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. తీవ్రవాద సంస్థ అల్‌ఖైదాను దెబ్బకొట్టడమనే తమ లక్ష్యమని, అఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం తమ బాధ్యత కాదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఇకపై అఫ్ఘనిస్థాన్ సంక్షోభంతో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. అయితే అధ్యక్షుడు జో బైడెన్ మాటల్ని రాజకీయ, రక్షణ రంగ నిపుణులు అంగీకరించటం లేదు. 20ఏండ్లుగా అఫ్ఘాన్‌లో తిష్టవేసిన అమెరికా..అక్కడ ఏం చేసినట్టు? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
ఆసియాలో భౌగోళికంగా కీలక స్థావరంగా అఫ్ఘాన్‌ను వాడుకోవాలనుకున్న అమెరికా కుయుక్తులు పారలేదని, ఇప్పటికే అక్కడ లక్ష కోట్ల డాలర్లు ఖర్చు చేయటం పట్ల అమెరికా ప్రజల్లో ఆగ్రహ ముందని విశ్లేషకులు చెబు తున్నారు. అఫ్ఘాన్ యుద్ధం వల్ల అమెరికాలోని ఆయుధ తయారీ కంపెనీలు లాభపడ్డాయిగానీ, ఎవ్వరికీ ఎలాంటి ఉపయోగమూ లేదని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. పెంటగాన్ అధికారులు, కమాండర్లు 'అబద్దాల కోరులు' అంటూ 'ద వాషింగ్టన్ పోస్ట్' వార్తా కథనం ప్రచురించటం ఒక ఉదాహరణ.
భారత్‌కు ఊహించని షాక్!
అఫ్ఘాన్ పరిణామాల్ని అంచనావేయటంలో భారత నిఘా వర్గాలు, విదేశాంగశాఖ పూర్తిగా విఫలమైందని విమర్శలున్నాయి. కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చాక మనదేశం అమెరికాకు చాలా దగ్గరైంది. అఫ్ఘాన్ విషయంలో గుడ్డిగా అమెరికా వెంట నడిచింది. వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో అఫ్ఘాన్‌లో భారత్ చేపట్టిన పలు ప్రాజెక్టులు బూడిదలో పోసిన పన్నీరేనని తేలిపోయింది. అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నప్పుడే తాలిబాన్లతో అమెరికా రహస్య చర్చలు జరిపింది. అక్కడ జరిగిన ఒప్పందాన్నే జో బైడెన్ నేడు అమలుజేశారు. గతకొన్ని నెలలుగా అఫ్ఘాన్‌లో అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ చాలా వేగంగా జరుగుతున్నా.. భారత్ ప్రభుత్వం ఓ అంచనాకు రాలేకపోయింది.
అడుగడుగునా కుట్రలు
అఫ్ఘాన్‌లో అడుగుపెట్టింది మొదలు కుట్రలు, కుతంత్రాలతోనే అమెరికా నడిచింది. అల్‌ఖైదా, తాలిబాన్లను తరిమికొట్టామని నిర్ణయించుకున్నాక.. అక్కడ రాజకీయ, అధికార వ్యవస్థ ఏర్పాటు చేయాలనే ఆలోచన అమెరికా పాలకులు చేయలేదు. రాజకీయ ఏజెంట్లు, ఆయుధ మాఫియాతో దశాబ్దాలుగా వ్యవహారం నడిపింది. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు ఆష్రాఫ్ గనీ, జాతీయ భద్రతా సలహాదారు హముదుల్లా మొహిబ్.. మొదలైనవారు అమెరికాకు అత్యంత నమ్మకస్తులు. వీరి నేతృత్వంలోని అఫ్ఘాన్ పౌర ప్రభుత్వం...అఫ్ఘాన్ సైన్యానికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు మూడు నాలుగు నెలలకోమారు జీతభత్యాలు ఇచ్చేది. దాంతో ఆ వర్గాల్లో పౌర ప్రభుత్వంపై పెద్దగా విశ్వాసం లేదు. పారిపోయిన మొహిబ్ నిన్నటివరకూ అఫ్ఘాన్ షాడో కింగ్...అని అమెరికా దినపత్రికలు వార్తా కథనాలు పేర్కొన్నాయి.