Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలు
- 'తాలిబనీ స్టైల్'లో దాడి చేయండని ఒకరు
- పెట్రోల్ చౌకగా కావాలంటే తాలిబన్ల వద్దకు వెళ్ళాలాని మరొకరు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్.. సర్వత్రా విమర్శలు
అగర్తల, భోపాల్ : బీజేపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలు తారా స్థాయికి చేరాయి. ఆఫ్ఘన్లో తాలిబన్ల అరచకాల నేపథ్యంలో వారి తరహాలో ప్రతిపక్షాలపై దాడులు చేయండంటూ బీజేపీ త్రిపుర నేత ఒకరు సొంత పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి బీజేపీ మధ్యప్రదేశ్ నేతను ఓ విలేకరి ప్రశ్నించగా.. చౌకగా పెట్రోల్ కావాలంటే తాలిబన్ల దగ్గరకు వెళ్ళండంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అనుచిత, రెచ్చగొట్టే వ్యాఖ్య లు చేసిన బీజేపీ నేతలకూ.. తాలిబన్లకు తేడా ఏమీలేదన్న విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
త్రిపురలో..
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన నాయకులపై 'తాలిబనీ స్టైల్'లో దాడి చేయాలని తన పార్టీ కార్యకర్తలను సదరు ఎమ్మెల్యే కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బెలోనియా నియోజకవవర్గ ఎమ్మెల్యే అరుణ్ చంద్ర భౌమిక్.. ఇటీవల కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించిన ప్రతిమా భౌమిక్‌ను సత్కరించే కార్యక్రమంలో భాగంగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. '' త్రిపురలో సీఎం విప్లవ్ కుమార్ దేవ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతిష్టను టీఎంసీ.. దిగజార్చాలని ప్రయత్నిస్తున్నది. ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే. వారిపై (టీఎంసీ కార్యకర్తలు) తాలిబన్ పద్దతిలో దాడి చేయాలి. వారు ఒక్కసారి ఏయిర్‌పోర్టులో దిగగానే మనం దాడి చేయాల్సినవసరం ఉన్నది. ప్రతి రక్తపు బొట్టుతో విప్లవ్ దేవ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి'' అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కాగా, ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులతో పాటు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మధ్యప్రదేశ్‌లో..
పెరుగుతున్న పెట్రోల్ ధరపై జర్నలిస్టు ఒకరు మధ్యప్రదేశ్‌లోని బీజేపీ నేత రామ్ రతన్ పాయల్‌ను ప్రశ్నించారు. పెట్రోల్ చౌకగా కావాలంటే ఆఫ్గనిస్తాన్‌కు వెళ్లాలంటూ వ్యాఖ్యలు చేశారు. 'తాలిబన్ల దగ్గరకు వెళ్లండి. అక్కడ లీటర్ పెట్రోల్ కారు చౌకగా.. రూ.50లకే లభిస్తోంది. ఇంధనాన్ని రీఫిల్ చేసేందుకు ఎవరూ లేని ఆఫ్గాన్‌లో.. మీ పెట్రోల్‌ను రీఫిల్ చేసుకోండి..' అని భారత జనతా యువ మోర్చా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వ్యాఖ్యనించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది. 'మీరు ప్రముఖ జర్నలిస్టేనా? దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? మూడో వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో ప్రధాని మోడీ పరిస్థితులను ఎలా నియంత్రి స్తున్నారో తెలుసా? దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం అందిస్తున్నారు' అంటూ వ్యాఖ్యానించారు. కాగా, బీజేపీ నేత.. తన మద్దతుదారులతో పాత్రికేయు లతో మాట్లాడే సమయంలో ఏ ఒక్కరూ మాస్కు ధరించలేదు. విచత్రమేమంటే.. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను ఎవ్వరూ పాటించడం లేదంటూ ఆయన సెలవివ్వటం కొనసమెరుపు.