Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు..
- 11 డిమాండ్లపై 19 రాజకీయ పార్టీలు .. ఆన్లైన్ సమావేశంలో ప్రతిపక్ష పార్టీల నిర్ణయం
న్యూఢిల్లీ : సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలకు 19 పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ పార్టీలన్ని 11 డిమాండ్ల సాధనకు దేశవ్యాప్తంగా ఆందోళన చేసేందుకు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. కరోనా నిబంధలు, ప్రోటోకాల్ పాటిస్తూ, నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు చేయాలని నిర్ణయించాయి. ధర్నాలు, ప్రదర్శనలు, హర్తాళ్లు వంటి ఆందోళనలు జరుగుతాయి. ఈ ఆందోళనల్లో పాల్గొనాలని 19 ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. లౌకిక, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు జరిగే ఆందోళనల్లో ముందుకు రావాలని కోరాయి. దేశాన్ని కాపాడాలనీ, రేపటి కోసం మార్చాలని విజ్ఞప్తి చేశాయి. శుక్రవారం 19 పార్టీల నేతలు ఆన్లైన్లో సమావేశమయ్యారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీ, డీఎంకే, శివసేన, జేఎంఎం, ఎన్సీ, ఆర్జేడీ, ఏఐయూడీఎఫ్, వీసీకే, ఎల్జేడీ, జేడీయస్, ఆర్ఎల్డీ, ఆర్ఎస్పీ, కేసీఎం, పీడీపీ, ఐయూఎంఎల్ పార్టీల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. సోనియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఎకె అంటోని (కాంగ్రెస్), శరద్ పవర్ (ఎన్సీపీ), ఉద్దవ్ ఠ్రాకే (శివసేన), మమతా బెనార్జీ, డెరిక్ ఓబ్రయిన్ (టీఎంసీ), ఎం.కె స్టాలిన్, టిఆర్ బాలు (డీఎంకే), హేమంత్ సోరెన్ (జేఎంఎం), సీతారాం ఏచూరి (సీపీఐ(ఎం), డి.రాజా (సీపీఐ), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), మెహబుబా ముప్తీ (పీడీపీ), శరద్ యాదవ్ (ఎల్జేడీ), కె.మణి (కేసీఎం), మహ్మద్ బషీర్ (ఐయూఎంఎల్), టి.తిరుమవలన్ (వీసీకే), జయంత్ చౌదరి (ఆర్ఎల్డీ), బద్రుద్దీన్ అజ్మాల్ (ఏఐయూడీఎఫ్) తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సజావుగా జరగకుండా అంతరాయం కలిగించడంలో కేంద్ర ప్రభుత్వ తీరును 19 పార్టీలు తీవ్రంగా ఖండించాయి. పెగాసస్ నిఘా అక్రమ వినియోగం పై చర్చించి, సమాధానం ఇవ్వడానికి నిరాకరించిం దనీ, మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు, కరోనా మహమ్మారిని నిర్వహణలో విఫలం అయిందని తెలిపారు. ధరల పెరుగుదల, నిరు ద్యోగం, ఇతర ప్రజల సమస్యలను మోడీ సర్కార్ ఉద్దేశపూర్వకం గానే పట్టించుకోలేదని విమర్శిం చాయి. పార్లమెంట్ లో ఎంపీలు, మహిళా ఎంపీలపై మార్షల్స్ దాడి చేశారని, చరిత్రలో ఎప్పుడూ జరగని అపూర్వ దశ్యా లను పార్లమెంట్ చూసిందని ధ్వజమెత్తాయి. కేంద్రం లోని కీలకమైన సమస్యలను లేవనెత్తడం ప్రతిపక్షాల హక్కు అని, చర్చలు లేకుండా ప్రభుత్వం చట్టాలను చేసిందని విమర్శించాయి. దేశంలోని ప్రజల కష్టాలను, సమస్యలను ప్రధాని మోడీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో పేర్కొనలేదని ఆరోపించాయి. తప్పుడు సమాచారంతో ఉత్తుత్తి నినాదాలు మాత్రమే ఇచ్చారని విమర్శించాయి. 2019, 2020లలో ఇచ్చిన ప్రసంగాలనే మళ్లీ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఈ ప్రసంగం ప్రజలు జీవితాలను నాశనం చేసే ఒక హెచ్చరిక అనీ, ప్రజల జీవితాలు మరింత నాశనం అవుతాయని తెలిపాయి. కరోనాను నిర్వహణలో మోడీ సర్కార్ భారీగా విఫలం అయ్యిందనీ, అనేక మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారని తెలిపాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావాలని సూచించాయి. అయితే ప్రస్తుతం కేవలం 11.3 శాతం మంది మాత్రమే రెండు డోసులు టీకాలు అందాయనీ, ఒక డోసు మాత్రం 40శాతం మంది అందాయని పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఏడాది చివరికి దేశంలోని వయోజనలందరికీ వ్యాక్సినేషన్ చేయడం అసాధ్యమని తెలిపాయి. టీకాల వేగం మందగించడానికి టీకా కొరతే ప్రధాన కారణమనీ, టీకాల లభ్యత గురించి పార్లమెంట్లో ఒకే రోజులో మూడు విభిన్న గణాంకాలను ప్రభుత్వం ఇచ్చిందని ఎద్దేవా చేశాయి.
దేశంలోని ఆర్థిక మాంద్యంతో ఆర్థిక వ్యవస్థ నాశనం అయిందనీ, కోట్టాది మంది ప్రజలు నిరుద్యోగంలోకి నెట్టబడ్డారని అన్నారు. పేదరికం, ఆకలి స్థాయిలు పెరిగిపోయాయనీ, ధరలు పెరుగుదల నిరంతరాయంగా కొనసాగుతుందని విమర్శించాయి. దేశంలోని ప్రజలను కష్టాల నుంచి బయటపడేందుకు అవసరమైన జీవనోపాధి కూడా నాశనం అయిందని ఆరోపించాయి. దేశంలో రైతుల చారిత్రాత్మక పోరాటం తొమ్మిది నెలలుగా కొనసాగుతుందనీ, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని విమర్శించాయి. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్ధతు ధర హామీ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. నిఘా కోసం కేంద్ర ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేయడంపై దేశ ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం సూటిగా సమాధానం ఇవ్వడానికి నిరాకరిస్తుందని ధ్వజమెత్తాయి. పెగాసస్ ప్రజల ప్రాథమిక హక్కులను పూర్తిగా ఉల్లంఘించడమే కాకుండా, దేశ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంస్థలపై దాడి జరుగుతుందని విమర్శించారు.
జాతీయ ఆస్తుల దోపిడితో పాటు, పెద్ద ఎత్తున బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటీకరణ చేస్తుందని విమర్శించారు. ఖనిజాలను, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాన మంత్రి అనుచరులకు ప్రయోజనం చేకూర్చే విధానాలు మోడీ సర్కార్ అవలంభిస్తోందని ధ్వజమెత్తారు.
దేశంలో దళితులు, గిరిజనులు, మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయనీ, ఇది రాజ్యాంగాన్ని పూర్తిగా నిరాకరిస్తుందని, దేశంలో సామాజిక న్యాయం వైపు వెళ్లడం అత్యవసరమని పేర్కొన్నాయి. ఈ అంశాల్లో దేనిపైన కూడా పార్లమెంట్లో చర్చ జరగలేదని, ఆగస్టు 15 ప్రధాని ప్రసంగంలోనూ వీటిల్లో దేనికి పరిష్కారం అందించలేదని విమర్శించాయి.
మోడీ సర్కార్‌పై ఐక్యంగా పోరాడాలి: సోనియా గాంధీ
కేంద్రంలోని మోడీ సర్కార్‌పై ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు నిచ్చారు. స్వాతంత్య్రోద్యమ విలువలు, రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలను విశ్వసించే ప్రభుత్వాన్ని అందించాలనే ఏకైక ఉద్దేశ్యంతో పోరాడాలని సోనియా పిలుపునిచ్చారు. 2024 లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా ఐక్యంగా, ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని సోనియా ప్రతిపక్ష పార్టీలను కోరారు. మనందరికీ ఎవరి సిద్దాంతాలు వారికి ఉన్న ప్పటికీ వాటన్నిటినీ అధిగమించి దేశ ప్రయోజనాల కోసం ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇదొక చాలెంజ్. ఐకమత్యాన్ని మించిన ప్రత్యామ్నా యం లేదు. 2024 ఎన్నికలే అంతిమ లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పోరాడాలని సోనియా సూచించారు. సమాఖ్య వ్యవస్థను, రాజ్యాంగ సంస్థల ను దెబ్బతీస్తున్నారంటూ మోడీ సర్కార్‌పై ధ్వజమె త్తిన ఆమె పరిమితులు, ప్రతి బంధకాలను అధిగ మించి ఐక్యంగా పోరాడాలన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు ఐక్యతను చాటినట్టుగానే పార్లమెంటు బయట కూడా అదే స్థాయిలో పోరాడాలన్నారు. ప్రతిపక్షాల ఐక్యత వల్ల ప్రభుత్వం వ్యాక్సినేషన్ పాలసీని మార్చుకుందన్న సోనియా మూడు వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
డిమాండ్లు..
- దేశంలో ఉచిత, సార్వత్రిక వ్యాక్సినేషన్ చేయాలి. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి. వ్యాక్సిన్ కొరత లేకుండా ఉత్పత్తి సమార్ధ్యాన్ని పెంచాలి. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లను సేకరించాలి. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి తగిన పరిహారం అందించాలి. ప్రజారోగ్య సంరోణ వ్యవస్థను విస్తరించేందుకు ముందుకు సాగాలి.
- కేంద్ర ప్రభుత్వం ఉచిత నగదు బదిలీలను అమలు చేయాలి. ఆదాయపు పన్ను పరిధికి వెలుపల ఉన్న అన్ని కుటుంబాలకు నెలకు 7,500ఇవ్వాలి. రోజువారీ అన్ని నిత్యావసర సరుకు లను కలిగి ఉన్న ఉచిత ఆహార కిట్లను పంపిణీ చేయాలి.
- సెంట్రల్ ఎక్సైజ్ సుంకాల పెంపును ఉపసంహరించుకోవాలి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసరాల ధరలను తగ్గించాలి. వంట నూనె ధరలను నియంత్రించాలి.
- మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి. రైతులకు ఎంఎస్పీకి తప్పనిసరిగా హామీ ఇవ్వాలి.
- ప్రభుత్వ రంగం అనియంత్రిత ప్రయివేటీకరణను ఆపాలి. కార్మిక హక్కులను పలుచన చేసే కార్మిక కోడ్లను రద్దు చేయాలి. నిరసన, వేతన పెంపు కోసం శ్రామిక ప్రజల హక్కులను పునరుద్ధరించాలి.
- చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పునరుద్ధరణ కోసం ద్రవ్య ఉద్దీపన ప్యాకేజీలను అమలు చేయాలి. మన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వ పెట్టుబడులను పెంచాలి. సామాజిక మౌలిక సదుపాయాలు, ఉపాధిని పెంచేందుకు దేశీయ డిమాండ్‌ను పెంచుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలను భర్తీ చేయాలి.
- కనీసం రెట్టింపు వేతనాలతో, 200 రోజుల పని దినాలతో ఉపాధి హామీని విస్తతంగా విస్తరించాలి. పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాలి.
- టీచర్లు, సిబ్బంది, విద్యార్థుల వ్యాక్సిన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలి.
- ప్రజలపై నిఘా కోసం పెగాసస్ స్పైవేర్‌ని ఉపయోగించడంపై తక్షణ సుప్రీం పర్యవేక్షణలో న్యాయవిచారణ చేపట్టాలి. రాఫె ల్ ఒప్పందంపై దర్యాప్తు చేయాలి. పాత ఆర్డర్ రద్దు, అధిక ధరతో కొత్త ఆరర్ ఇవ్వడంపై విచారణ జరపాలి.
10. రాజకీయ ఖైదీలందరుని విడుదల చేయాలి. భీమా కోరెగావ్ కేసులో యూఏపీఏ, సీఏఏ, వ్యతిరేక నిరసనల, ప్రజాస్వామ్య హక్కులు, ప్రజల పౌర స్వేచ్ఛలను ఉల్లంఘించడానికి దేశద్రోహం వంటి ఇతర కఠినమైన చట్టాలను ఉపయోగించడం ఆపాలి. భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కును వినియోగించినందుకు అదుపులోకి తీసుకున్న మీడియా సిబ్బందిని విడుదల చేయాలి.
11. జమ్ము కాశ్మీర్‌లోని రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి. పూర్తి రాష్ట్ర హౌదాను పునరుద్ధరించాలి. కేంద్ర ప్రభుత్వ సేవలు, స్వేచ్ఛగా ఎన్నికలను నిర్వహించాలి.