Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆక్సిజన్ కొరత మరణాలపై కేజ్రీవాల్ సర్కారు Vర ఎల్జీ
- ఆక్సిజన్ కొరత మరణాలపై కమిటీ ప్రతిపాదనను తిరస్కరించిన అనిల్ బైజల్
న్యూఢిల్లీ: దేశంలో ఆక్సిజన్ కొరత కారణంగా వివిధ ఆస్పత్రుల్లో సంభవించిన మరణాలపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఆక్సిజన్ కొరత కారణంగా సంభవించిన మరణాల నిర్ధారణ కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలనే సీఎం కేజ్రీవాల్ సర్కారు ప్రతిపాదనను ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తిరస్కరించారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తాజాగా వెల్లడించారు. ''ఆక్సిజన్ మరణాల నిర్ధారణ కమిటీకి సంబంధించిన ఫైల్‌ను ఎల్జీకి పంపాం. అయితే, ఆక్సిజన్ మరణాల విచారణకు మళ్లీ ఆయన అనుమతి నిరాకరించారు'' అని సిసోడియా మీడియాతో అన్నారు. ఎలాంటి కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఎల్జీ పేర్కొన్నారని చెప్పారు. ఆక్సిజన్ కొరత కారణంగా ఎన్ని మరణాలు సంభవించాయో నివేదించాలని రాష్ట్రాలకు కేంద్రం చెబుతుండగా.. ఎల్జీ మాత్రం విచారణకు అనుమతించడం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం తప్పుదోవ పట్టిస్తున్నదని ఆరోపించారు. ఆక్సిజన్ కొరత కారణంగా ఏ ఒక్కరు చనిపోలేదని రాష్ట్రాలు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని కేంద్రం కోరుకుంటున్నదని ఆరోపించారు. దీనికి అనుగుణంగా ఆక్సిజన్ కొరత కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదని ఇటీవల పార్లమెంట్లో కేంద్రం ప్రభుత్వం పచ్చి అబద్దాలను చెప్పిందన్నారు. ఇలాంటి ప్రతిపాధనలను బైజల్ తిరస్కరించడం రెండో సారి. కాగా, కరోనా సెకండ్ వేవ్ కాలంలో కరోనా విజృంభణ కారణంగా దేశంలోని అన్ని ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. కనీస వైద్యం అందక వేలాది మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా రోగులతో పాటు సాధారణ రోగులు సైతం ప్రాణాలు కోల్పోయారు. దీనికి సాక్షంగా చాలా ఆస్పత్రులు.. తమకు ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించడం, మీడియాలో వచ్చిన కథనాలు సాక్ష్యంగా నిలుసున్నాయి.