Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వాలిఫికేషన్ విషయంలో సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ : ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత విషయంలో సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ఉద్యోగ ఖాళీకి దరఖాస్తు చేసుకోవాలంటే నోటిఫికేషన్ సమయంలో అభ్యర్థికి 'అవసరమైన అర్హత' ఉండాలన్న నిబంధనను తోసిపుచ్చుతూ.. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థికి 'సమానమైన అర్హత' ఉంటే సరిపోతుందని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కేరళలోని ప్రభుత్వ పాఠశాలల్లో హైస్కూల్ అసిస్టెంట్ (హెచ్ఎస్ఎ) - నేచురల్ సైన్స్ పోస్టులకు దరఖాస్తు చేసిన ఇద్దరు అభ్యర్థుల అప్పీళ్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. 2012లో కెపిఎస్సి నోటిఫికేషన్లో పేర్కొన్నట్లుగా సంబంధిత అర్హత ఆయా అభ్యర్థులు పూర్తిచేసిన బిఇడి సబ్జెక్ట్‌లలో ఉందా లేదా అనే దానిపై కోర్టు విచారణ జరిపింది. ఉద్యోగానికి నేచురల్ సైన్సెస్ సబ్జెక్ట్‌లో బిఇడి చేసివుండాలని కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కెపిఎస్సి) అర్హతగా పెట్టింది. అప్పీలుదారులు ప్రవీణ్‌కుమార్, పి.అనితాదేవి వరుసగా మైసూర్ విశ్వవిద్యాలయం, కోయంబత్తూర్‌లోని భారతీయార్ విశ్వవిద్యాలయం నుండి బయోలాజికల్ సైన్స్‌లో బిఇడి డిగ్రీలు పొందారు. బయోలాజికల్ సైన్సెస్‌లో వారి డిగ్రీలు కేరళలోని ఒక వర్సిటీ నుండి తీసుకున్న నేచురల్ సైన్సెస్ డిగ్రీకి ''సమానమైనవి''గా పరిగణించబడ్డాయి. ఉద్యోగాలకు వారిద్దరినీ షార్ట్‌లిస్ట్ చేయడంతోపాటు ఇంటర్వ్యూలో పాల్గొనడానికి కూడా అనుమతించారు. నోటిఫికేషన్ సమయంలో పేర్కొన్నట్లుగా సంబంధిత అర్హత ఆయా అభ్యర్థులకు లేదన్న అభ్యంతరంతో కెపిఎస్సి వారి అభ్యర్థిత్వాలను నిలిపివేసింది. వీరిద్దరి డిగ్రీలు కేరళ యూనివర్సిటీల నుంచి నేచురల్ సైన్సెస్‌లో పొందిన డిగ్రీలతో సమానమని రాష్ట్ర ఉన్నత విద్యావిభాగం 2019లో ఇచ్చిన జిఓలను కూడా కెపిఎస్సి తోసిపుచ్చింది. సర్వీసు కేసుల్లో గతానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు వర్తించవని, 2012 నోటిఫికేషన్ సమయంలో అభ్యర్థులకు సంబంధిత అర్హత లేదని పేర్కొంది. కెపిఎస్సికి అనుకూలంగా కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జిఓలు అభ్యర్థుల బిఇడి కోర్సుల సమానత్వాన్ని నిర్ధారిస్తున్నాయని, వారు నోటిఫికేషన్ తేదీకి సమానమైన అర్హతను కలిగి ఉన్నారని భావిస్తున్నామని జస్టిస్ బోస్ పేర్కొన్నారు. సంబంధిత జిఓలు కొన్ని విద్యార్హతల ప్రస్తుత స్థితిని మాత్రమే స్పష్టం చేశాయని అన్నారు.