Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతీయులంతా సురక్షితమే
- కేంద్ర ప్రభుత్వవర్గాలు వెల్లడి
న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్‌లో 150మంది భారతీయుల్ని తాలిబన్లు కిడ్నాప్ చేశారన్న వార్తల్లో నిజం లేదని భారత ప్రభుత్వ వర్గాలు శనివారం అధికారికంగా ప్రకటించాయి. త్వరలో వీరిని స్వదేశానికి తీసుకొస్తామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ వచ్చేందుకు కాబుల్ విమానాశ్రయం వద్దకు చేరుకున్న భారతీయుల్ని తాలిబన్లు కిడ్నాప్ చేశారనే వార్తలు ఒక్కసారిగా కలకలం రేపాయి. అయితే వారిని తాలిబన్లు ప్రశ్నించి, విడుదల చేసినట్టు తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాబుల్ విమానాశ్రయం సమీపంలో ఉన్న 150మంది ప్రయాణికుల్ని తాలిబన్లు కిడ్నాప్ చేసినట్టు శనివారం ఉదయం స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నాయి. ఆ వెంటనే భారత విదేశాంగశాఖ అప్రమత్తమై..సంప్రదింపులు చేపట్టింది. కాగా ప్రయాణికుల వద్ద ఉన్న పత్రాలు పరిశీలించేందుకే వారిని తీసుకెళ్లినట్టు తెలిసింది. తనిఖీల అనంతరం వారిని విడుదల చేశారని, త్వరలో వారిని భారత్‌కు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. మరోపక్క ఈ కిడ్నాప్ వార్తలు అవాస్తవమని ప్రభుత్వ వర్గాలు మీడియాకు చెప్పాయి. తాలిబాన్ ప్రతినిధి కూడా ఈ వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే.
కొనసాగుతున్న తరలింపు ప్రక్రియ
కల్లోలిత ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాబుల్ విమానాశ్రయం నుంచి కొంతమంది భారతీయులను వాయుసేన ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొస్తున్నారు. శనివారం ఉదయం 85మందికిపైగా భారత పౌరులతో సి-130జె విమానం కాబుల్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విమానం ఇంధనం నింపుకొనేందుకు తజకిస్థాన్‌లో దిగినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక వాయుసేనకు చెందిన సి-17 విమానం కూడా కాబుల్ ఎయిర్‌పోర్టులో ఉంది. భారతీయులను తీసుకొని ఆ విమానం కూడా త్వరలోనే స్వదేశానికి బయల్దేరనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆఫ్ఘాన్లోని భారత రాయబార కార్యాలయం సిబ్బందిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి తరలించిన విషయం తెలిసిందే. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తర్వాత ఆ దేశ గగనతలాన్ని మూసివేశారు. దాంతో భారతీయుల తరలింపు ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. అయితే ఆ తర్వాత అమెరికా దళాల సహకారంతో భారత్ ప్రత్యేక విమానాల్లో భారతీయుల తరలింపునకు ఏర్పాటుచేసింది.