Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 రైళ్లు రద్దు, మరో 54 మళ్లింపు
- నేడు రైతులు, మంత్రుల మధ్య చర్చలు
న్యూఢిల్లీ : చెరకు మద్దతు ధర, పెండింగ్ బకాయిల కోసం పంజాబ్‌లో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. మరోవైపు హర్యానాలోని బిజెపి ప్రభుత్వం నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న రైతులపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తోంది. చెరకు ధర క్వింటాకు రూ.70 పెంచాలని, సుమారు రూ.250 కోట్ల చెరకు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్‌లో 32 రైతు సంఘాలు శుక్రవారం మొదలు పెట్టిన జలంధర్‌లోని ఒకటో నెంబర్ జాతీయ రహదారి దిగ్బంధనం శనివారం కూడా కొనసాగింది. రైల్వే లైన్ల దిగ్బంధనం తాజాగా ప్రారంభించడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఫిరోజ్‌పూర్ డివిజన్ రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 50 రైళ్లు రద్దయ్యాయి. 54 రైళ్లు దారిమళ్లించారు. రైతుల నిరసన కారణంగా ఉత్తర రైల్వేలోని అంబాలా డివిజన్లో 13 రైళ్లను రద్దు చేశారు. సిటీ రైల్వే స్టేషన్లో చండీగఢ్-అమృత్సర్ ఇంటర్-సిటీ ప్రత్యేక రైళ్లు రెండు రోజులు రద్దు చేశారు. కొన్ని రైళ్లు స్వల్పకాలం నిలిపివేశారు. రైతుల డిమాండ్లు నెరవేరే వరకు దిగ్బంధనం కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. అత్యవసర వాహనాల రాకపోకలకు అనుమతించారు. జలంధర్ జిల్లా ధనోవాలి గ్రామం సమీపంలో జలంధర్-ఫగ్వారా జాతీయ రహదారిని రైతులు అడ్డుకోవడంతో, పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. జలంధర్-చాహెరు సెక్షన్లో ఆందోళనకు దిగిన రైతులు, జలంధర్‌లో లూథియానా-అమత్సర్, లూథియానా-జమ్ము రైలు ట్రాక్‌లను అడ్డుకున్నారు.
నేడు చర్చలు రైతుల ప్రతినిధులు, పంజాబ్ మంత్రుల మధ్య ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కీలక సమావేశం జరగనుంది.