Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తు తున్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఢిల్లీలోని లోధీ రోడ్లో 24 గంటల్లో రికార్డుస్థాయిలో 149 మిల్లీమీటర్లు, సఫ్దార్‌గంజ్ ప్రాంతంలో 138.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆగస్టు నెలలో ఢిల్లీలో ఒక రోజులో ఇంత భారీ స్థాయిలో వర్షం కురవటం 13ఏండ్లలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షం కారణంగా ఢిల్లీ రైల్వేస్టేషన్లో వరద నీరు చేరింది. దాంతో అనేక రైళ్లు రద్దయ్యాయి. మింటో బ్రిడ్జ్ సహా పలు అండర్‌పాస్ రోడ్లలో భారీగా నీరు చేరడంతో ఆ మర్గాల్లో రాకపోకలను నిలిపివేశారు. నోయిడా, ఆజాద్‌పూర్, ప్రగతి మైదాన్, లజ్‌పత్‌నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇండ్లల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షానికి రాజ్ఘాట్లోనూ నీరు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నీట మునిగిన ప్రాంతాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనావేస్తున్నారు. ఢిల్లీలో అంతటా శనివారం ఆరెంజ్ అలర్ట్, ఆదివారం ఎల్లో అలర్ట్ జారీచేశారు. భారీ వర్షం కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపైకి భారీగా చేరిన వరదనీరును మోటార్లతో తొలగిస్తున్నారు. నగరంలోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరికొన్ని రోజులపాటు వానలు ఇదేవిధంగా ఉంటాయని తెలిపింది.