Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఐఐఇఏ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా
- ఎస్‌సిజడ్‌ఐఇఎఫ్ మహసభలు ప్రారంభం
- ప్రయివేటీకరణ విధానాలను తిప్పికొట్టాలి
అమరావతి : ఐక్యపోరాటాలతోనే ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొట్టడంతో పాటు, ప్రభుత్వ రంగ పరిరక్షణ సాధ్యమవుతుందనిఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐఐఇఎ) ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా అన్నారు. ఎల్ఐసి ఉద్యోగుల సౌత్ సెంట్రల్ జోన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ 12వ మహాసభలు శనివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. రెండు రోజులు పాటు జరగనున్న ఈ మహసభల్లో తొలి రోజు సభకు సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఎస్‌సిజడ్‌ఐఇఎఫ్) వైస్ ప్రెసిడెంట్ ఎమ్‌డి మెహబూబ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీకాంత్ మిశ్రా మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ప్రయివేటీకరణ విధానాలను దూకుడుగా అమలుచేస్తోందని ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా బలాన్ని కూడగొట్టి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బిజెపి విధానాలు, కరోనా ప్రభావం వల్ల కోట్లాది మంది దినసరి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు తమ ఉపాధిని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి కొనుగోలు శక్తి పడిపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఆత్మనిర్భర్ భారత్ వంటి నినాదాలు చేస్తున్న ప్రభుత్వం మరోపక్క ప్రభుత్వరంగంలోని బీమాసంస్థలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌తో సహా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి తెగబడుతోందన్నారు. స్టాక్ మార్కెట్లో ఎల్ఐసి ఐపిఓను చేపట్టడం దేశ ఆర్థికవ్యవస్థకు విఘాతమని, బలమైన ప్రభుత్వరంగం వల్లే దేశం ముందున్న సవాళ్లను అధిగమించగలమని గుర్తు చేశారు. బిజెపి దేశ ప్రజల ఐక్యతను కుల, మత, ప్రాంతాల ప్రాతిపదికగా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజా స్వామిక విధానాలను బీమా ఉద్యోగులు సమైక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలన్నారు. మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు మాట్లాడుతూ బీమా సంస్థగా ప్రభుత్వరంగ ఎల్ఐసి ప్రఖ్యాతిగాంచిందన్నారు. మన దేశం ఆర్థిక స్వావలంబన సాధించటంలో బ్యాంకులు, ఎల్ఐసి ముఖ్య భూమిక పోషించాయని చెప్పారు. బిజెపి ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాలు అన్ని రంగాల ప్రజలకూ నష్టాన్నే మిగిల్చుతున్నా యన్నారు. బిజెపి పాలనలో అంబేద్కర్ సూచించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం జరగడం లేదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవాలనే ఆలోచనతో ఎల్ఐసి వంటి సంస్థలను జాతీయం చేస్తే ఇప్పుడు ప్రభుత్వాలు వాటిని ప్రయివేటుకు అప్పగించాలని చూస్తున్నాయన్నారు. ప్రజలు నిరసన తెలిపే అవకాశం లేకుండా చేసేందుకు కరోనా సమయంలో ఆగమేఘాలపై ఈ ప్రయివేటీకరణకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయాలని బిజెపి చెబుతోందని, కాపాడుకోవాలని ఉద్యోగులు చెప్పాలని అన్నారు. దీనికి ప్రజా బలం అవసరమని అన్నారు. ఉద్యోగులు సంస్థను కాపాడుకుంటూనే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల సహకారంతో ఉద్యమించాలని సూచించారు. ఈ మహాసభలో ఎఐఐఇఎ జాతీయ అధ్యక్షలు వి. రమేష్, ఉపాధ్యక్షులు కెవివియస్యన్ రాజు, ట్రెజరర్ బి.ఎస్.రవి, మాజీ అధ్యక్షులు అమానుల్లాఖాన్, మాజీ ప్రధాన కార్యదర్శి కె. వేణుగోపాల్, అసిస్టెంట్ ట్రెజరర్ కె.ఎస్.రాజశేఖర్, జోనల్, డివిజన్ల నాయకులు, మచిలీపట్నం డివిజన్ అధ్యక్షులు జె.సుధాకర్, ప్రధాన కార్యదర్శి, జి.కిషోర్‌కుమార్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.