Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు కంపెనీల్లోనే కాదు.. పీఎస్‌యూల్లో కూడా
- పెరుగుతున్న క్యాజువల్ కార్మికులసంఖ్య:సీీపీఎస్ఈ సర్వే
న్యూఢిల్లీ : దేశంలో వివిధ రంగాలకు చెందిన కార్మికులు ఇప్పటికే అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. కనీస వేతనాలు దక్కకపోవడం, అధిక పని గంటలు వంటి సమస్యలతో వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. అయితే, ఈ తీరు ప్రయివేటు కంపెనీల్లోనే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూ) ల్లోనూ కనబడుతున్నది. ముఖ్యంగా, పర్మినెంట్ కాని కార్మికుల సంఖ్య పీఎస్‌యూల్లో పెరుగుతున్నది. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (సీపీఎస్ఈ) విడుదల చేసిన ప్రభుత్వ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ నివేదికను ఉభయ సభల్లోనూ ప్రవేశపెట్టారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సర్వే 2019-20 ప్రకారం.. పబ్లిక్ కంపెనీలలో క్యాజువల్, రోజువారీ కార్మికుల సంఖ్య 2015-16 నుంచి 2019-20 మధ్య 178 శాతం పెరిగింది. అలాగే, కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య అదే కాలంలో 86 శాతం పెరిగింది. అయితే, పబ్లిక్ కంపెనీలలో నాన్-పర్మినెంట్ ఉద్యోగాల పెరుగుదల అనేది రెగ్యులర్ ఉద్యోగాల కోతతో కూడి ఉంటుంది. ఇదే సమయంలో రెగ్యులర్ ఉద్యోగులలో 25శాతం తగ్గింపు నమోదు కావడం గమనార్హం. కాగా, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నంలో ఉండటం, పెట్టుబడుల ఉపసంహరణకు పూనుకోవడం వంటి చర్యలు ఉద్యోగులను గందరగోళంలో పడేసిందని విశ్లేషకులు ఆరోపించారు. ఉదాహరణకు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) పెట్రోలియం కంపెనీల తన వాటాల పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. మార్చి 2020 నాటికి, పీఎస్ఈ సర్వే ప్రకారం.. బీపీసీఎల్‌లో ఉద్యోగుల బలం 40,172గా ఉన్నది. అయితే వీరిలో 28,923 మంది అంటే దాదాపు 72 శాతం మంది కాంట్రాక్టు ఉద్యోగులే కావడం గమనార్హం. అలాగే, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)లో, మరో పబ్లిక్ ఎంటర్ప్రైజ్లో తన వాటాలకు సంబంధించిన పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్రం చూస్తున్నది. అయితే, ఇక్కడ 1,33,586 మంది ఉద్యోగులలో 48 శాతం మంది కాంట్రాక్టులో ఉన్నారు. కోలిండియా లిమిటెడ్‌తో సహా బొగ్గు రంగంలో ఎనిమిది పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లలో మొత్తం 3,50,996 మంది ఉగ్యోగులలో 23 శాతం మంది నాన్-పర్మినెంట్ ఉద్యోగులే కావడం గమనార్హం. కాంట్రాక్టులైజేషన్ సమస్య 'క్యాన్సర్' వంటిదని సీఐటీయూ జాతీయ కార్యదర్శి స్వదేశ్ దేవ్ రారు అన్నారు. 'పర్మనెంట్' అంశమే కాకుండా అనేక సమస్యలపై కేంద్రం దృష్టి పెట్టాల్సినవసరం ఉన్నదని చెప్పారు.