Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొత్తం కేసులు 3.24 కోట్లకు పైనే
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో దేశంలో కరోనా కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ కరోనా వైరస్ వివిధ వేరియంట్లు చాలా దేశాల్లో ప్రమాదకర స్థాయిలో పంజా విసరడం, భారత్‌లో థర్డ్‌వేవ్ అంచనాల మధ్య ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 30,948 పాజిటివ్ కేసులు, 403 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 3,24,24,234 చేరగా, మరణాలు 4,34,367కు పెరిగాయి. ఇప్పటివరకు మొత్తం 3,16,36,469 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,53,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో అధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్‌లు టాప్ లో ఉన్నాయి.
ఇదిలా ఉండగా, ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిల్లా మూడు డోసుల కరోనా వ్యాక్సిన్ 'జైకోవ్-డీ'ని అక్టోబర్ నాటికి కోటి డోసులు సరఫరా చేస్తామని సదరు కంపెనీ వెల్లడించారు. ఢిల్లీలో కరోనాకు సంబంధించిన పలు ఆంక్షలు సడలిస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 6 వరకు పొడిగిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అయితే, సోమవారం నుంచి 50 శాతం సిట్టింగ్ సామర్థ్యంతో థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.
డెల్టా విజృంభణతో ఆంక్షల దిశగా పలు దేశాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. డెల్టా వేరియంట్ ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తుండటంతో పలు దేశాలు మళ్లీ ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలో అక్కడి సర్కారు లాక్డౌన్ విధించింది.దేశంలోని 70 శాతం మందికి వ్యాక్సిన్లు వేసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో వేలాది మంది ప్రజలు లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఈ క్రమంలో వందిలాది మందిని ప్రభుత్వం అరెస్టు చేసింది. ఫ్రాన్స్‌లో 'హెల్త్‌పాస్'కు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు ఆందోళనకు కొనసాగిస్తున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 21,23,24,054 లక్షల కరోనా కేసులు, 44,40,840 మరణాలు నమోదయ్యాయి. అధిక పాజిటివ్ కేసులు, మరణాలు నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, యూకే, టర్కీ, అర్జెంటీనా, కొలంబియా స్పెయిన్, ఇరాన్, ఇటలీ, ఇండోనేషియాలు టాప్‌లో ఉన్నాయి.
రాష్ట్రంలో 231 మందికి కరోనా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తాజాగా 231 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఇద్దరు మరణించారు. ఆదివారం విడుదల చేసిన బులెటిన్ లో పాజిటివ్ రేటు 0.49 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు 46,987 మందికి టెస్టులు చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో42,651 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 4,336 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 844 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,384 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కోలుకున్న 453 మందిని డిశ్చార్జి చేశారు. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 66 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా కొమురంభీం ఆసిఫాబాద్, నారాయణపేట, నిర్మల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు.
10 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో గత ఆదివారంతో పోలిస్తే ఈ వారం జీహెచ్ఎంసీతో సహా 10 జిల్లాల్లో కేసులు పెరిగాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేసులు పెరిగాయి.
15 జిల్లాల్లో తగ్గిన కేసులు
జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ - మల్కాజిగిరి, ములుగు, నల్లగొండ, పెద్దపల్లి, వికారాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, వనపర్తి జిల్లాల్లో వారం తర్వాత కూడా కేసుల్లో పెరుగుదల కానీ, తగ్గుదల కాని కనిపించలేదు.