Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు విమానాల్లో తీసుకొచ్చిన భారత్
- కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద తొక్కిసలాటలో ఏడుగురు మృతి
న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్లు చేజిక్కించుకున్న నేపథ్యంలో అక్కడి నుంచి భారతీయులను తీసుకొచ్చే ప్రక్రియను భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. మూడు విమానాల్లో దాదాపు 400 మంది ఆదివారం దేశానికి చేరుకున్నారని సంబంధిత అధికారులు వెల్లడించారు. వీరిలో 329 మంది భారతీయులతోపాటు ఇద్దరు ఆఫ్ఘన్ ఎంపిలు అనార్కలి హోనార్యార్, నరేందర్ సింగ్ ఖల్సా ఉన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సి-17 విమానం ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కాబూల్ నుంచి 168 మందితో ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు వచ్చింది. వీరిలో 107 మంది భారతీయులు, 20 మంది ఆఫ్ఘన్లు ఉన్నారు. మరోవైపు 87 మంది భారతీయులు, ఇద్దరు నేపాల్ దేశస్తులను ఎయిరిండియా ప్రత్యేక విమానంలో తజకిస్తాన్ రాజధాని దుసాంబే నుంచి తీసుకొచ్చారు. శనివారం నాడు వారిని కాబూల్ నుంచి ఐఎఎఫ్ విమానంలో తజకిస్తాన్‌కు తరలించారు. గత కొన్ని రోజులుగా అమెరికా, నాటో విమానాల ద్వారా కాబూల్ నుంచి ఖతార్ రాజధాని దోహాకు వెళ్లిన మరో 135 మంది భారతీయులు కూడా తాజాగా మరో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారని అధికారులు తెలిపారు.అమెరికా, ఖతార్, తజకిస్తాన్‌తో పాటు పలు ఇతర దేశాలతో సమన్వయం చేసుకొని భారత్ ఈ తరలింపు మిషన్‌ను చేపట్టిందని అధికారులు పేర్కొన్నారు. కాబూల్ నుంచి దోహాకు తీసుకెళ్లిన వారంతా దాదాపు ఆఫ్ఘనిస్తాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు విదేశీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులని వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న మిగతా భారతీయులను కూడా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బగ్చి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.కాబూల్ నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకురావడంపై దృష్టి పెట్టామని విదేశాంగశాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇంకా ఉండిపోయిన భారతీయుల వివరాలను సేకరించే పనిలో ఉన్నామని, ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌ను సంప్రదించాలని సూచించారు.