Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేలకోట్ల రూపాయలు పోగేసుకున్న బీమా కంపెనీలు
- భారీ సంఖ్యలో రైతుల క్లెయిమ్స్ తిరస్కరణ
- రాయల్ సుందరం.. రూ.1157 కోట్లు ప్రీమియం వసూలు
- రైతులకు ఇచ్చింది రూ.307కోట్లు
- భారతీ ఆక్సాకు రూ.1575కోట్లు రాబడి
- రైతులకు చెల్లించింది..రూ.438కోట్లు..
ఇది చదవితే..ప్రభుత్వ పథకాలు ప్రజల కోసమా..ప్రయివేటు కార్పొరేట్ కంపెనీల కోసమా? అనే సందేహం కలుగుతోంది. పంట నష్టపోయిన రైతును ఆదుకునే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం 'పీఎం ఫసల్ బీమా యోజన' ప్రయివేటు బీమా కంపెనీలకు బంగారు బాతులా మారింది. గత నాలుగేండ్లుగా ఈ పథకం 13 ప్రయివేటు బీమా కంపెనీలకు కనకవర్షం కురిపిస్తోంది. వీటి లాభాల మార్జిన్ 55 నుంచి 74శాతం వరకూ ఉంది. రైతులు, ప్రభుత్వం నుంచి వసూలు చేసేది ఎక్కువగా..క్లెయిమ్స్(రైతుకు ఇచ్చేది)పై చెల్లించేది తక్కువగా ఉందని 'పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ' స్వయంగా లెక్కతేల్చింది.
న్యూఢిల్లీ : బీమారంగంలోకి ప్రయివేటు, కార్పొరేట్ వర్గాలు చొరబడితే పరిస్థి తులు ఎలా ఉంటాయో చెప్పడానికి 'ఫసల్ బీమా యోజన' పథకం అమలు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. పంట బీమాలో చేరిన రైతులు ఎంతగా నష్టపోతున్నారో 'పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ' నివేదికలో పేర్కొన్నారు. ఇందులో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఒకటుంది. అదేంటంటే..క్లెయిమ్స్ తిరస్కరించటం, బకాయిలు చెల్లించకపోవటం..వంటివాటిపై రైతులు చేసిన ఫిర్యాదుల వివరాలు ఇవ్వాలని కేంద్రాన్ని స్టాండింగ్ కమిటీ కోరగా, ఆ వివరాలు కేంద్రం ఇవ్వలేదు. తద్వారా ప్రయివేటు బీమా కంపెనీలపై ఈగ వాలకుండా చూసుకుంది. ఐదేండ్ల క్రితం(2016లో) మోడీ సర్కార్ తీసుకొచ్చిన 'ఫసల్ బీమా యోజన' ప్రయివేటు బీమా కంపెనీలకు వరంగా మారింది. బీమా ప్రీమియం వసూలుకు...క్లెయిమ్ సెటిల్మెంట్స్కు మధ్య చాలా తేడా కనపడుతోంది. ఈ పథకం ద్వారా ప్రతి ఏటా ప్రయివేటు కంపెనీలు వందలకోట్ల రూపాయలు లాభాలు పోగేసుకున్నాయి. ప్రభుత్వ బీమా కంపెనీలైన యునైటెడ్ ఇండియా, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలు స్వల్ప మార్జిన్ (5 నుంచి 17శాతం) చూసుకొని, మిగతాదంతా రైతులకు అందజేస్తున్నాయి. వ్యవసాయంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పై విషయాల్ని నమోదుచేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ నివేదికను రాజ్యసభలో విడుదలచేసింది.
రైతుల్ని ఆదుకున్న ప్రభుత్వ బీమా సంస్థలు
ఐదు ప్రభుత్వ బీమా సంస్థలు, 13ప్రయివేటు బీమా కంపెనీలు ఈ పథ కాన్ని అమలుజేస్తున్నాయి. 2016 నుంచి 2020 వరకూ గణాంకాలన్నీ స్టాండింగ్ కమిటీ సేకరించింది. ఇందులో ప్రధానమైన 'క్లెయిమ్ సెటిల్మెంట్' వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గత నాలుగు..ఐదేండ్లలో ప్రభుత్వ బీమా సంస్థ 'అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా' వసూలు చేసిన మొత్తం ప్రీమియం విలువ 32,429కోట్లు. రైతులు చేసుకున్న క్లెయిమ్స్‌కు చెల్లించిన మొత్తం 26,874కోట్లు. మరో ప్రభుత్వ బీమా సంస్థ 'యునైటెడ్ ఇండియా'కు వెళ్లిన ప్రీమియం మొత్తం రూ.4553కోట్లు. క్లెయిమ్స్‌కు చెల్లించిన మొత్తం రూ.4062కోట్లు. అలాగే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ రూ.2514కోట్లు వసూలు చేయగా, క్లెయిమ్స్‌కు చెల్లించినది రూ.2,574కోట్లు. ప్రభుత్వ బీమా సంస్థల ప్రాఫిట్ మార్జిన్ 5 నుంచి 17శాతంవరకూ ఉంది. ఇక న్యూ ఇండియా అష్యరెన్స్ కంపెనీ అయితే.. 4660కోట్లు వసూలుచేసి, రూ.5145కోట్లు రైతులకు చెల్లించింది. అలాగే ఓరి యెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వసూలు చేసిన ప్రీమియం కన్నా ఎక్కువగా రైతులకు చెల్లించింది. అయితే ప్రయివేటు బీమా కంపెనీలు మాత్రం లాభాల ఆర్జనే లక్ష్యంగా పనిచేశాయి. ఆ కంపెనీల లాభాల మార్జిన్ భారీగా నమోదైంది. దీనినిబట్టి పెద్ద సంఖ్యలో రైతుల క్లెయిమ్స్‌ను తిరస్కరించాయని తెలుస్తోంది.
ప్రయివేటు బీమా సంస్థ ప్రీమియం వసూలు క్లెయిమ్స్ చెల్లింపు లాభాల మార్జిన్
రాయల్ సుందరం(2017-20) రూ.1157కోట్లు రూ.307కోట్లు 74శాతం
భారతీ ఆక్సా రూ.1575కోట్లు రూ.438కోట్లు 72శాతం
ఫ్యూచర్ జనరాలి ఇండియా రూ.1532కోట్లు రూ.599కోట్లు 61శాతం
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ రూ.6150కోట్లు రూ.2,580కోట్లు 58శాతం
ఇఫ్కో-టోక్యో రూ.6136కోట్లు రూ.3320కోట్లు 46శాతం