Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఆందోళన
- ముజఫర్‌నగర్ కిసాన్ మహాపంచాయతీకి ఖాప్‌లు మద్దతు
న్యూఢిల్లీ : దేశంలో వివిధ ప్రాంతాల్లో రైతుల ఆగ్రహానికి బీజేపీ నేతలు గురవుతున్నారు. రాజస్థాన్-హర్యానా సరిహద్దు షాజహాన్పూర్లో బీజేపీకి చెందిన సౌత్ ఢిల్లీ ఎంపి రమేష్ బిధురి వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు.
నల్ల జెండాలతో నిరసన తెలిపారు. నిరసన నుంచి తప్పించుకోవడానికి ఎంపి తన వాహనాన్ని మరో మార్గంలోకి వెళ్లేందుకు పోలీసులు సహాయం తీసుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో బీజేపీ ఏర్పాటు చేసుకున్న సమావేశానికి రైతుల సెగ తగిలింది. స్థానిక రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తం అయింది. రైతులు నల్ల జెండాలతో బీజేపీ సమావేశానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. హర్యానాలోని హిసార్‌లో ఒక రైతు పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు బీజేపీ ఎమ్మెల్యే జోగి రామ్ సిహాగ్కు రైతు సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. బీజేపీ నాయకుడు క్షమాపణ చెప్పకపోతే, అతనికి వ్యతిరేకంగా తమ నిరసనను తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించారు. చండీగఢ్‌లో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మహిళా రైతుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ముజఫర్‌నగర్ కిసాన్ మహాపంచాయతీకి ఖాప్‌లు మద్దతు
మిషన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో సెప్టెంబర్ 5న జరగబోయే మహా పంచాయతీకి ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్‌లో ఖాప్‌లు తమ మద్దతును అందించడానికి ముందుకు వచ్చారు. ఎస్‌కెఎంతో సంబంధం ఉన్న రైతు నాయకులు ఆ రోజు ముజఫర్‌నగర్‌కు రైతులను సమీకరించడానికి వివిధ జిల్లాల్లో అనేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మిషన్ యూపీ, ఉత్తరాఖండ్‌లో భాగంగా బీజేపీ, మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, దృక్పథాల గురించి ప్రజలకు వివరించడానికి ఈ కార్యక్రమం జరుగుతుంది. దాని తరువాత ఎస్‌కెఎం బృందాలు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని అన్ని ప్రాంతాల్లో తిరిగి సమావేశాలు ఏర్పాటు చేస్తారు.
కొనసాగుతున్న రైతు ఉద్యమం
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దు ప్రాంతాల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఆదివారం నాటికి రైతు ఉద్యమం 269వ రోజుకు చేరింది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల్లో ఎక్కడికక్కడే ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీజేపీ, దాని అనుబంధ పార్టీల నేతల బహిష్కరణలు కొనసాగుతున్నాయి. రక్షా బంధన్ సందర్భంగా పంజాబ్, హర్యానాలోని చాలా మంది గ్రామీణ మహిళలు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు రాఖీలు పంపారు. కొనసాగుతున్న రైతు పోరాటానికి తమ మద్దతు, ప్రోత్సాహం ఈ విధంగా గ్రామీణులు వ్యక్తీకరించారని ఎస్‌కెఎం నేతలు తెలిపారు.
చెరకు ధరపై పంజాబ్ ప్రభుత్వంతో రైతుల చర్చలు విఫలం
రైతు సంఘాలతో పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన చర్చలు విఫలం అయ్యాయి. చెరకు ధర పెంచాలని, పెండింగ్‌లో ఉన్న చెరకు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్‌లోని 32 రైతు సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు జాతీయ రహదారి, రైల్వే లైన్ల దిగ్బంధన చేపట్టారు. రెండు రోజుల పాటు జరిగిన ఆందోళనతో పలు రైళ్లు రద్దు అయ్యాయి. రోడ్లపై ట్రాఫిక్ తీవ్రమైంది. రైళ్ల రద్దు అవ్వడంతో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో పంజాబ్ ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టేందుకు, రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. అందులో భాగంగా ఆదివారం చండీగఢ్‌లో పంజాబ్ భవన్లో రైతు సంఘాలు, ప్రభుత్వం మధ్య చర్చలు జరిగాయి. పంజాబ్ ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర సహకార శాఖ మంత్రి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతుల తరపున 32 రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశం ఎటువంటి ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వలేదు. పంజాబ్‌లో చెరకు ఉత్పత్తికి సంబంధించిన ఉత్పత్తి వివరాలపై పరిశోధన నిపుణులు సోమవారం రైతులతో సంప్రదింపులు జరుపుతారని ప్రభుత్వం తెలిపింది. అందులో వచ్చిన సమాచారం ఆధారంగా ముఖ్యమంత్రి పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధి, బృందం నాయకులకు హామీ ఇస్తారు. చర్చల్లో ఎటువంటి పరిష్కారం రావకపోవడంతో రైతులు తమ నిరవధిక పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో జాతీయ రహదారులు, రైల్వే లైన్ల దిగ్బంధన కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు తెలిపారు.