Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెత్తందార్ల దుశ్చర్య.. మహారాష్ట్రలో ఘటన
- గ్రామ పంచాయతీ కార్యాలయం బయటే అంత్యక్రియలు నిర్వహించిన దళిత కుటుంబం
ముంబయి : దేశంలో దళితుల పట్ల అగ్రవర్ణాల ఆధిపత్యం తగ్గడం లేదు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో చోటు చేసుకున్న తాజా ఘటనే దీనికి నిదర్శనం. చనిపోయిన వ్యక్తి ధనాజీ సాతే అంత్యక్రియల కోసం తీసుకెళ్తుండగా దళిత కుటుంబానికి అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయి. పెత్తందారీ కులాలకు చెందిన వ్యక్తులతో పాటు స్థానికులు ఆ కుంటుంబాన్ని అడ్డుకున్నారు. అయితే, దళిత కుటుంబానికి అండగా నిలవాల్సిన పోలీ సులు.. శవయాత్రను అడ్డుకునేలా వ్యవహరించడం గమనార్హం.దళితులైన తమ పట్ల పెత్తందార్లు, స్థానికులతో పాటు పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ఆ కుటుంబం నిరసన తెలపాలనుకున్నది. ఇందులో భాగంగా మాలేవాడీ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుటే ఆ కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది. కాగా, మృతుడు ధనాజీ సాతే ఆ గ్రామ సర్పంచ్ దశరథ్ సాతేకు సోదరుడు కావడం గమనార్హం. అయితే, ధనాజీతో గ్రామంలోని కొందరు ఆధిపత్య కులాలకు చెందిన వ్యక్తులతో గొడవలు ఉండేవని సమాచారం. ''శవయాత్ర నిర్వహించడానికి స్థానికులు అభ్యంతరం తెలిపారు. మమ్మల్ని అడ్డుకున్నారు. పోలీసులు కూడా వారికే వత్తాసు పలికారు. మా వాహనాలకు ఎదురుగా పోలీసు వాహనాలను పార్క్ చేశారు. ఈ యాత్రను నిర్వహించడానికి అనుమతించాలని పోలీసులను ఎంతగానో వేడుకున్నాం. కానీ, వారు మాత్రం ఏ మాత్రమూ కనికరించలేదు '' అని దశరథ్ సాతే తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి 13 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అలాగే, దళిత కుటుంబానికి చెందిన ఏడుగురి పైనా కౌంటర్ కేసు నమోదు కావడం గమనార్హం.