Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలంధర్ జాతీయ రహదారి దిగ్బంధం
- రైల్వే లైన్లపైనా కొనసాగుతున్న రైతుల ఆందోళనలు
- రైతు నేతలు, వ్యవసాయ నిపుణుల చర్చలు
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని రైతుల జాతీయ రహదారి దిగ్బంధం నాలుగో రోజూ కొనసాగింది. చెరకు ధర పెంచాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంజాబ్‌లోని 32 రైతు సంఘాలు ఐక్యంగా ధనోవలి సమీపంలోని జలంధర్ వద్ద జాతీయ రహదారి దిగ్బంధం 20న, రైల్వే లైన్ల దిగ్బంధం ఈ నెల 21న ప్రారంభించారు. ఆదివారం రైతు సంఘాల నేతలతో ఆ రాష్ట్ర మంత్రి, ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చలు జరిపినప్పటికీ ఎటువంటి ఫలితం రాలేదు. దీంతో సోమవారం కూడా రైతుల జాతీయ రహదారి దిగ్బంధం, రైల్వే లైన్లను అడ్డుకోవడం కొనసాగింది. రైతుల ఆందోళనకు వేలాది మంది మహిళలు సంఘీభావం తెలిపారు. వాహనాలను వేర్వేరు మార్గాల వైపు మళ్లించారు. ఫిరోజ్‌పూర్ డివిజన్లో 71 రైళ్లు దిగ్బంధానికి గురయ్యాయి. 51 రైళ్లు రద్దయ్యాయి. 17 రైళ్లు మళ్లించారు. 3 రైళ్లు షార్ట్ టెర్మినేటెడ్ చేశారు. మరోవైపు జలంధర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు సంఘాల నేతలు, వ్యవసాయ విశ్వవిద్యాలయ నిపుణులు, పంజాబ్ ప్రభుత్వ సాంకేతిక నిపుణుల మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశం ఫలితంగా పంజాబ్ ముఖ్యమంత్రి మంగళవారం ప్రకటన చేసే అవకాశం ఉంది.
జాతీయ కన్వెన్షన్‌కు సన్నాహాలు
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం తొమ్మిది నెలలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ఈ నెల 26, 27 తేదీల్లో సింఘూ సరిహద్దుల్లో జాతీయ కన్వెన్షన్ నిర్వహించనుంది. దీనికి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. యుపిలో నిరసన తెలిపిన రైతులపై కేసులు పెడుతున్నారు. పిలిభిత్‌లో మంత్రి బల్దేవ్ సింగ్ ఉలాఖ్కు నల్ల జెండాలతో నిరసన తెలిపిన 58 మంది రైతులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ కేసులను ఉపసంహరించుకోవాలని, శాంతియుతంగా నిరసన తెలిపే పౌరుల హక్కును హరిస్తే సహించేది లేదని రాష్ట్రంలో రైతు సంఘాలు స్పష్టం చేశాయి. దేశ రాజధాని సరిహద్దు ప్రాంతాల్లో రైతుల ఆందోళన సోమవారం నాటికి రైతు ఉద్యమం 270వ రోజుకు చేరింది.