Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పుపై నిపుణుల హెచ్చరిక
- ప్రధాని కార్యాలయానికి నివేదిక అందజేత
న్యూఢిల్లీ : కోవిడ్ థర్డ్‌వేవ్ ముప్పు అక్టోబరు చివరి నాటికి గరిష్టానికి చేరుకోవచ్చని నిపుణుల బృందం ప్రధాన మంత్రికి అందజేసిన నివేదికలో పేర్కొంది. పెద్దల మాదిరిగానే పిల్లలు కూడా అధిక ముప్పును ఎదుర్కొనే అవకాశాలున్నాయని, అందువల్ల మరింత మెరుగైన సదుపాయాలతో సిద్ధంగా వుండాలని సూచించింది. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ ఆధ్వర్యాన నిపుణుల బృందం ఏర్పడింది. ఆ బృందం ''చిల్డ్రన్ ప్రిపేర్డ్నెస్ : వల్నరబిలిటీ అండ్ రికవరీ'' (థర్డ్‌వేవ్ సన్నద్ధత : పిల్లలకు వ్యాపించే అవకాశాలు, కోలుకోవడం'') అనే శీర్షికతో ఒక నివేదికను రూపొందించి ప్రధాని కార్యాలయానికి అందజేసింది. పిల్లల్లో కోవిడ్ వ్యాపించడానికి ఏ మేరకు అవకాశాలున్నాయి, దాన్ని ఎదుర్కొనడానికి అవసరమైన వ్యూహాలేంటి అన్న వివరాలను ఇందులో పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో పిల్లలు ప్రభావితమైతే వారి అవసరాలకు తగినట్లుగా వైద్య సదుపాయాలు, డాక్టర్లు, సిబ్బంది, అంబులెన్సులు వెంటిలేటర్లు వంటి వైద్య పరికరాలు లేవని నివేదిక అసంతృప్తిని వ్యక్తం చేసింది. కోవిడ్ రీ ప్రొడక్షన్ రేట్ పెరుగుతుండడం చూస్తుంటే కోవిడ్ థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైందని మనకు తెలుస్తోందని, జులై చివరి వారంలో ఈ ఆర్ విలువ 0.9 నుండి 1కి పెరిగిందని నివేదిక తెలిపింది. ఇతర ఆరోగ్య సమస్యలు, వికలాంగులైన పిల్లలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం వుందని, వారికి ప్రాధాన్యతా ప్రాతిపదికన టీకా వేయాల్సిన అవసరం వుందని నివేదిక పేర్కొంది. పిల్లలకు టీకా వేయనందున వారికి ఎక్కువ వ్యాపించే అవకాశం వుంటుందని, వారిద్వారా ఇతరులకు అంటుకునే ప్రమాదం కూడా ఎక్కువేనని నివేదిక స్పష్టం చేసింది. అందువల్ల వారికి టీకాలు అందజేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించింది. సెకండ్‌వేవ్ కన్నా థర్డ్ వేవ్ తీవ్రత కొంత తగ్గుదల వుంటుందని మరో అంచనా పేర్కొంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పిల్లల వైద్య నిపుణుల కొరత 82శాతంగా వుందని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో టీకాల కొరత 63శాతంగా వుందని నిపుణుల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగా వుందని, కోవిడ్ సమయంలో అనుసరించాల్సిన వ్యవహార శైలికి కట్టుబడి లేకపోతే పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుందని హెచ్చరించింది.