Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల వాదనలో వైరుధ్యాలు
- ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసుపై ఉమర్ ఖాలీద్
న్యూఢిల్లీ : గతేడాది చోటుచేసుకున్న ఈశాన్య ఢిల్లీ అల్లర్ల ఘటనకు సంబంధించి పోలీసుల వాదనలో అనేక వైరుధ్యాలున్నాయని ఈ కేసులో నిందితుడిగా ఉన్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నేత ఉమర్ ఖలీద్ సోమవారం ఢిల్లీ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పచ్చి అబద్ధాలతో 'వండి వార్చింది' మాత్రమేనని పేర్కొన్న ఆయన తనకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది త్రిదీప్ పైస్ ద్వారా న్యాయస్థానాన్ని కోరారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్ల ఘటనపై పోలీసులు ఖలీద్‌తో పాటు ఇతరులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల ఎఫ్ఐఆర్ కేవలం తమను లక్ష్యంగా చేసుకొని రూపొందించిందని, ఇది అనవసరమైనదని త్రిదీప్ అడిషనల్ సెషన్స్ జడ్జి అమితాబ్ రావత్‌కు తెలిపారు. పోలీసుల వాదనల్లో రెండు వైరుధ్యాలను ఖాలీద్ తరపు న్యాయవాది ఈ సందర్భంగా ఎత్తిచూపారు. మొదటిగా, మహారాష్ట్రలో ఖాలీద్ చేసిన 21 నిమిషాల ప్రసంగాన్ని కోర్టుకు చూపిన త్రిదీప్.. అందులో పోలీసులు చెబుతున్నట్లుగా అతను ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏమీ చేయలేదని, హింసకు పిలుపివ్వలేదని అన్నారు. ''గాంధీని ఆదర్శంగా తీసుకొని ఐక్యంగా ఉండాలని మాత్రమే ప్రజలకు సందేశం ఇచ్చారు. దీన్ని ఉగ్రవాదం అంటున్నారు. ఇందులో దేశద్రోహ కంటెంట్ లేనేలేదు'' అని పేర్కొన్నారు. రెండోది, అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సందర్భంగా అల్లర్లు సృష్టించాలని ఇతరులతో కలిసి ఖాలీద్ జనవరి 8న కుట్ర పన్నారని పోలీసులు వాదిస్తున్నారనీ, అసలు ట్రంప్ పర్యటనకు సంబంధించిన వార్తలు ఫిబ్రవరిలో వచ్చాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు ఇటువంటి పచ్చి అబద్ధాలను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారని త్రిలీప్ కోర్టుకు తెలిపారు. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదనీ, బెయిల్ మంజూరు చేయాలని జేఎన్‌యూ విద్యార్థి షార్జీల్ ఇమాన్ ఢిల్లీ కోర్టును కోరారు. షార్జీల్ ప్రసంగంలో హింసను రేకెత్తించే ప్రసంగాలు లేవని న్యాయవాది తన్వీర్ అహ్మద్ పేర్కొన్నారు. సీఏఏ, ఎన్నార్సీ రాజ్యాంగ విరుద్ధమనీ, ప్రభుత్వం పునరాలోచించాలనీ, కేంద్రం ఆ పనిచేయకుంటే ఆందోళనల బాట పడతామని షార్జీల్ అన్నారనీ, ఇది రాజద్రోహం ఎలా అవుతుందని ప్రశ్నించారు.