Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.6 లక్షల కోట్ల పీఎస్‌యూల ఆస్తుల విక్రయం
- మరిన్ని సంస్థలను ప్రయివేటీకరిస్తాం : మంత్రి సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కారు అడ్డగోలుగా అమ్మే పనిలో ఉంది. ఇప్పటికే ఎయిరిం డియా, బీపీసీఎల్, వైజాగ్ స్టీల్, షిప్పింగ్ కార్పొరేషన్, పవన్ హాన్స్ తదితర సంస్థలను చౌక బేరానికి పెట్టగా.. తాజాగా మరిన్ని మౌలిక వసతులరంగ పీఎస్యూలపై కన్ను పడింది. నిధుల సమీకరణ పేరుతో లక్షల కోట్ల విలువ చేసే రైల్వే, రోడ్లు, విద్యుత్ రంగాల ఆస్తులను ప్రయివేటుకు కట్టబెట్టే పనిలో నిమగమై ఉంది. సోమ వారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం. మరిన్ని ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరించాలని తమ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుందని మంత్రి తెలిపారు. దీనికి సంబం ధించిన నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ (ఎన్ఎంపీ) ప్రక్రియను మంత్రి వెల్లడించారు. 11 మంత్రిత్వ శాఖలతో కలిసి ఈ ప్రణాళికలను రూపొందించారు. ఈ విధానంతో ఆయా రంగాల్లోకి భారీగా పెట్టుబడులు రానున్నాయన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రధాని మోడీ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ పథకంలో భాగంగా ఈ ఆస్తుల విక్రయాలు జరగనున్నాయి.
రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్, గ్యాస్పైప్లైన్లను విక్రయించనున్నట్టు మంత్రి వెల్లడించారు. వీటి ద్వారా మొత్తం రూ.6 లక్షల కోట్ల నిధులు సేకరించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఆస్తుల విక్రయాలు చేపట్టినట్టు మంత్రి సీతారామన్ వెల్లడించారు. నిర్ధిష్ట కాలానికి ఆస్తుల అమ్మకం ద్వారా నిధుల సమీకరణను చేపట్టనున్నామన్నారు. కీలక రంగాలు మినహా మిగతా రంగాలను ప్రయివేటీకరించాలని నిర్ణయించామన్నారు. కాగా.. ఆస్తుల యాజమాన్య హక్కులు మాత్రం ప్రభుత్వానికే ఉంటాయని పేర్కొనడం గమనార్హం. ప్రయివేటీకరణ తర్వాత యాజమాన్య హక్కు సర్కార్‌కు ఎలా ఉంటుందో మంత్రి స్పష్టం చేయలేదు.
రహదారులు, రైల్వే ఆస్తులు, విమానాశ్రయాలు, విద్యుత్ సరఫరా లైన్లు, గ్యాస్ పైప్లైన్స్ను విక్రయించడానికి రోడ్‌మ్యాప్ రూపొందించింది. దీంతో వచ్చే నాలుగేండ్లలో రూ.6 లక్షల కోట్లు సమీకరించనున్నది. ఇందులో రోడ్లు, రహదారుల నుంచి రూ.1.6 లక్షల కోట్లు, రైల్వేకి సంబంధించి రూ.1.5 లక్షల కోట్లు, మరో రూ.79,000 కోట్ల నిధులు విద్యుత్ రంగాల నుంచి రానున్నాయని నిటి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వెల్లడించారు. విమానాశ్రయాల విక్రయం ద్వారా రూ.20,800 కోట్లు, రూ.13వేల కోట్లు నౌకాశ్రయాలు, టెలికం నుంచి రూ.35,000 కోట్లు, స్టేడియంల నుంచి రూ.11,500 కోట్లు, విద్యుత్ సరఫరా విభాగంలో రూ.45,200 కోట్ల విలువ చేసే ఆస్తులను అమ్మకానికి పెట్టనున్నట్టు కాంత్ తెలిపారు. ఇవన్నీ కూడా దాదాపుగా ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలోకి రానున్నాయన్నారు. ఆయా రంగాల ఆస్తులను ప్రయివేటు నిర్వహణకు అప్పగించనున్నామని మంత్రి సీతారామన్ తెలిపారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న 25 విమానాశ్రయాలు, 40 రైల్వే స్టేషన్లు, 15 రైల్వే స్టేడియాలు ప్రయివేటుకు అప్పగించే జాబితాలో ఉన్నాయని సమాచారం. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు సంబంధించి 14,917 సిగల్ టవర్లు, 2.86 లక్షల కిలోమీటర్ల భారత్‌నెట్ ఫైబర్, రూ.24,462 కోట్ల విలువ చేసే 8,154 కిలోమీటర్ల సహజ వాయువు పైపులైన్లు, రూ.22,504 కోట్ల విలువ చేసే ఇతర ఉత్పత్తుల పైపులైన్లను అమ్మకానికి పెట్టనుంది.