Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాదిలో 100 మంది..
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అక్కడి ఉద్రిక్త పరిస్థితులు, ఉగ్రకదలికలు తగ్గుముఖం పట్టినట్టు కనిపించింది. కానీ మళ్లీ అక్కడ ఉగ్రకదలికలు మొదలయ్యాయి. తాజాగా జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సొపోర్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకెళ్తే.. సొపోర్‌లోని పీఠ్‌శీర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతాదళాలు సోమవారం అర్ధరాత్రి కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో తారసపడ్డ ఉగ్రవాదులు భద్రతాబలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొదట ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కొద్దిసేపటికి మరొకరిని మృతదేహాన్ని సైతం గుర్తించారు. మంగళవారం జమ్మూకాశ్మీర్ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైతం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కాగా, వారు ఏ ఉగ్ర సంస్థకు చెందినవారో గుర్తించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.