Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి గుప్కర్ అలయన్స్ హితవు
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్‌కు 2019 ఆగస్టు 5 నాటి ముందున్న ప్రత్యేక రాజ్యాంగ హోదాను పునరుద్ధరించాల్సిందేనని పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పీఏజీడీ) మంగళవారం పునరుద్ఘాటించింది. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం తాండవిస్తున్న శ్మశాన నిశ్శబ్దాన్ని సాధారణ పరిస్థితులుగా పరిగణించవద్దని కేంద్రానికి హితవు పలికింది. ఇలాంటి ప్రకటనలతో ప్రజలను అవమానపరచడాన్ని ఆపివేయాలని, లేదంటే ప్రమాదకరమైన పర్యవసానాలు వుంటాయని హెచ్చరించింది. 'భారత పౌర సమాజానికి, రాజకీయ పక్షాలకు మేం విజ్ఞప్తి చేసేది ఒక్కటే, మేం కూడా గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నాం. అయితే, ప్రస్తుత ప్రభుత్వం మమ్మల్ని అవమానపరుస్తోంది. ఇది కాశ్మీర్, జమ్మూ, లడఖ్ ప్రజలకు ఆమోదయోగ్యం కాదు' అని గుప్కర్ అలయన్స్ అధికార ప్రతినిధి, సీపీఐ(ఎం) నేత యూసుఫ్ తరిగామి చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షులు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా నివాసంలో సమావేశమైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ నేతలపై తరచుగా జరుగుతున్న ఎన్ఐఏ, ఈడీ దాడులు సమర్థనీయం కాదనీ, వాటిని చూస్తుంటే ఈ నేతలందరినీ 'దొంగలు, నేరస్తులు'గా చిత్రీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు వున్నదని తరిగామి ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధికి సంబంధించి కేంద్రం చెబుతున్నదంతా వాస్తవ విరుద్ధమని తరిగామి స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రకటనలతో వారి వైఖరేమిటో వెల్లడవుతోందన్నారు. పాలన సరిగా లేదనీ, అభివృద్ది కొరవడిందని జమ్మూ ప్రజలు అబిప్రాయపడుతున్నారని ఆయన అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో స్థానిక అధికారులకు ప్రాధాన్యతే లేదని బయటి ప్రాంతాలకు చెందినవారే ఇక్కడ పదవులు ఎక్కువగా నిర్వహిస్తున్నారని తెలిపారు.