Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్టుబడిదారుల కోసమే ఎన్ఎంపీ ప్రాజెక్ట్ : సీఐటీయూ
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ ప్రకటించిన 'నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్'(ఎన్ఎంపీ)పై రాజకీయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, గ్యాస్ పైప్ లైన్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్ ఉత్పత్తి...మొదలైన రంగాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని, వనరుల్ని తెగనమ్ముతూ కేంద్రం చేపట్టిన ఎన్ఎంపీ (ఆస్తుల నగదీకరణ) వివాదాస్పదమవుతోంది. కేంద్రం ఈ విధమైన ప్రాజెక్ట్ చేపటడ్డాన్ని సీఐటీయూ(సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్) తీవ్రంగా వ్యతిరేకించింది. పలు రాజకీయ పార్టీలు సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎంతో విలువైన దేశ వనరులు, సంపదను దేశ, విదేశాల్లోని ప్రయివేటు పెట్టుబడిదారులకు అప్పజెప్పటమేంటని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నయా ఉదారవాద విధానాల్ని ప్రోత్సహిస్తున్న అంతర్జాతీయ పెట్టుబడుదారులకు ఈ ప్రాజెక్ట్ కనకవర్షం కురిపిస్తుందని సీఐటీయూ ఒక ప్రకటనలో తెలిపింది.కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 'ఎన్ఎంపీ' ప్రాజెక్ట్‌పై తాజాగా ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా, వేల కి.మీ జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ లైన్లు, జల, పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, బొగ్గు క్షేత్రాలు, బీఎన్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ టవర్లు...మొదలైనవాటిల్లో ప్రభుత్వ ఆస్తుల్ని ప్రయివేటుకు అమ్మబోతున్నామని, సుమారుగా రూ.6లక్షల కోట్లు సమీకరించబోతున్నామని కేంద్రం ప్రకటించింది. దాంతో వివిధ రంగాల్లో ప్రభుత్వ ఆస్తులు ప్రయివేటు పెట్టుబడుదారుల చేతుల్లోకి వెళ్లబోతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో ఎన్ఎంపీపై కార్మికసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఒక అవినీతితో కూడుకున్న ప్రాజెక్ట్, ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ ఆస్తులు పెట్టేందుకే మోడీ సర్కార్ దీనికి ఆమోదం తెలిపిందని ఆరోపణలు వెలువడ్డాయి. ''భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎనలేని నష్టాన్ని తెచ్చిపెడుతుందీ ప్రాజెక్ట్. ఊహించని సమస్యలు ఉత్పన్నమవుతాయి. కార్మికులు, ఇతర ఉద్యోగులు సైతం అనేక సమస్యల్లో చిక్కుకుంటారు. దేశంలోని ప్రయివేటు లాబీ కోసం ఇలాంటి భారీ ప్రాజెక్ట్ చేపట్టడం అన్యాయం. ఈ ప్రాజెక్ట్‌కు, కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, ఉద్యోగులు నిరసన గళాన్ని వినిపించాలి''అని సీఐటీయూ పిలుపునిచ్చింది.