Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2014 నుంచి వేతనాల పెంపుకోసం ఎదురుచూపు
న్యూఢిల్లీ: చాలిచాలని వేతనాలతో తమ బతుకులు దారుణంగా మారుతున్నాయని మహారాష్ట్ర బీడీ కార్మికులు పేర్కొంటున్నారు. దాదాపు ఏడు సంవత్సరాల క్రితం ప్రకటించిన వేతనాల పెంపు కోసం 4 లక్షల మందికి పైగా ఉన్న బీడీ కార్మికులు ఎదురుచూస్తున్నారు. మరఠ్వాడలోని పర్బనీ ప్రాంతానికి చెందిన ఇందుమతి మోర్ గత 18 సంవత్సరాలుగా బీడీ కార్మికురాలిగా కొనసాగుతున్నారు. రిజిస్టర్ బీడీ కార్మికురాలైన ఆమె వేతనాలు, డీఏ పెంపునకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వచ్చి ఏడేండ్లు అవుతుంది. అయినప్పటికీ ఇప్పటికీ ఆ ఉత్తర్వులు అమల్లోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ''వేతనాల పెంపు కోసం కొన్ని నెలలుగా పర్బానీలో నిరసన వ్యక్తం చేస్తున్నాం. కానీ బీడీ కంపెనీలు గానీ, ప్రభుత్వం గానీ ఈ విషయంలో మాకు సహాయం చేయలేదు'' అని ఇందుమతి అన్నారు. రాష్ట్ర కార్మిక శాఖకు పిటిషన్ దాఖలు చేసిన 2,500 మంది బీడీ కార్మికుల్లో ఆమె ఒకరు.
మహారాష్ట్రలో 4 లక్షల మందికి పైగా రిజిస్టర్ బీడీ కార్మికులు ఉన్నారు. వీరు అక్కడి 16 కంపెనీలతో పాటు స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్ల ద్వారా బీడీ పరిశ్రమలో కొనసాగుతూ.. వారి నుంచి వేతనాలు అందుకుంటున్నారు. కార్మికులకు ప్రతి 1000 బీడీలకు రూ.210 వేతనం అందించడంతో పాటు వారికి డీఏ కూడా అందించాలని రాష్ట్ర కార్మికశాఖ 2014లో ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయమై మహారాష్ట్ర బీడీ కామ్గర్ జాయింట్ యాక్షన్ కమిటీ సహ సమన్వయకర్త ఎచ్ఎం.షేక్ మాట్లాడుతూ.. ''2014 వేతన సవరణ ప్రకారం రోజుకు 1000 బీడీలు తయారు చేసే కార్మికుడికి రోజువారీ వేతనం రూ.210తో పాటు రూ.102.50 డీఏ కలిపి మొత్తంగా రూ.312.50లు చెల్లించాలి. అయితే, 1000 బీడీలు తయారు చేస్తున్న కార్మికులకు రూ.179 మాత్రమే చెల్లిస్తున్నారు. దీనిపై నిరసన చేయగా.. అధికారిక హామీ లభించింది. కానీ వేతన పెంపు ఇప్పటికీ అమల్లోకి రాలేదు. దీనిపై కార్మికశాఖకు సైతం అనేక సార్లు ఫిర్యాదు చేశాం. అయినా బీడీ కార్మికులను ఎవరూ పట్టించుకోవడం లేదు'' అని అన్నారు. కేంద్ర కార్మిక మంత్రి, కార్యదర్శి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు.