Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉధృతంగా అన్నదాతల ఆందోళనలు
- బీజేపీ నేతలే కాదు..అదానీ,అంబానీ సంస్థలకు తాకనున్న రైతన్న సెగ
నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలై..26 నాటికి మరోమైలు రాయి.
ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దేశమంతా ఉద్యమిస్తున్నా..మోడీ సర్కార్ చెవికెక్కటంలేదు. లాభాల్లో ఉన్న సంస్థల్ని కూడా హౌల్సేల్గా అమ్మకానికి పెట్టింది. అంతేకాదు వందశాతం ప్రయివేటీకరిస్తామంటూ బీజేపీ సర్కార్ ఉద్యోగులు, కార్మికులను పణంగా పెట్టడానికి సిద్ధమైపోయింది. ఇది నాణేనికి ఓవైపు. మరోవైపు నల్లచట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు దీక్షలు మొదలుపెట్టి..ఆగస్టు 26 నాటికి తొమ్మిదినెలలు కానున్నది. రోజుకో వినూత్నంగా నిరసనలు చేస్తూ..ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలను అన్నదాతలు నిలదీస్తుంటే..తాజాగా అదానీ షోరూమ్‌లు, అంబానీ పెట్రోల్ పంపుల వద్ద జై జవాన్..జై కిసాన్ అంటూ నిరసనలు కొనసాగించటానికి సన్నద్ధమవుతున్నారు. ఇంతకీ ఈ తొమ్మిదినెలల్లో మోడీ సర్కార్‌ను రైతులు ఏవిధంగా ముచ్చెమటలు పట్టించారో విశ్లేషించితే..
న్యూఢిల్లీ: రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోడీ. ఏకంగా సేద్యాన్ని కార్పొరేట్లవద్ద తాకట్టుపెట్టుకుని బానిసలయ్యేలా నల్లచట్టాలను బీజేపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ..మొదలైన రైతు ఉద్యమం మరికొన్ని గంటల్లో తొమ్మిదినెలల రికార్డును సాధించనున్నది. మోడీ సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా మడమతిప్పకుండా రైతుల తడాఖాఏంటో చూపుతూనేఉన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ..జై కిసాన్ ఏంటో నిరూపించారు. జన్‌ఆశీర్వాద్ యాత్రల్లోనూ కేంద్రమంత్రులను నిలదీస్తున్నారు. నల్లచట్టాలవల్ల కలిగే అనర్థాలు చెప్పటానికి రైతునేతలు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు దుందుడుకుగా వ్యవహరిస్తూ..రైతులపై రాజద్రోహం కేసులు,అరెస్టులతో ఉద్యమాన్ని నీరుగార్చేలా బీజేపీ ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇంతలా మోడీ,బీజేపీ పాలిత రాష్ట్రాలు వేధిస్తున్నా..రైతులు వెనక్కి తగ్గటంలేదు. ఉద్యమాలను మరింత జోష్‌తో ముందుకు తీసుకెళ్తున్నారు.
మొదటిది..:ఎక్కడో పొలంలో నాట్లు వేసి..నీరు పోసి..పంట చేతికొచ్చిందా అని అన్నదాత ఎదురుచూసేవాడు.
ఆ పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర కూడా రాని ప్రస్తుత పరిస్థితుల్లో భూమినే నమ్ముకుంటున్నాడు. అలాంటి రైతు మెడపై మోడీ ప్రభుత్వం కత్తిపెట్టిన తీరుకు వ్యతిరేకంగా పోరుబాటపట్టాడు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ఆధారంగా కనీస మద్దతుధర ఇవ్వాలని రైతులు కోరుతుంటే..మోడీ ప్రభుత్వం తెచ్చిన ఆ నల్ల చట్టాలు తమ జీవితాలకు ఉరికొయ్యల్లాంటివనీ,దేశప్రజలకు ఆహారధాన్యాలు అందనంత ఎగబాకుతాయని రైతు సంఘాలు స్పష్టంచేస్తున్నాయి. అన్నదాత చేస్తున్న ఉద్యమం గురించే దేశ,విదేశాల్లోనూ చర్చ జరుగుతున్నది.
రెండవది: ఉద్యమలక్ష్యాన్ని నిర్దేశించుకుని అన్నదాతలు నడుంబిగిస్తున్నారు. మోడీ సర్కార్,బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉద్య మాన్ని అణచాలని చూస్తున్నా.. పట్టుదలతో ఉద్యమానికి ఊపిరిపోస్తున్నారు.
ఇంత జరుగుతున్నా గోడీ మీడియాలో సైలెంట్ అయిపోతున్నది. ఎందుకంటే..ఈ మీడియాకు బీజేపీ సర్కార్లకు అడ్వర్టైజ్ మెంట్లరూపంలో కోట్లు జమ అవుతున్నాయి. అయితే రైతుల ముందున్న లక్ష్యం ఒక్కటే..దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేసేదిశగా ఆలోచనలు చేస్తున్నారు. తాజాగా అదానీ షోరూమ్‌లు, అంబానీ పెట్రోల్ పంపుల వద్ద ఘెరావ్ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రైతు బతుకు రోడ్డునపడటానికి ఈ త్రయమే కారణమంటూ.. మోడీ,అదానీ, అంబానీల దిష్టిబొమ్మలను దహనం చేసే కార్యక్రమాన్ని తలపెట్టారు. దేశవ్యాప్తంగా ఒకటిన్నరలక్షలకుపైగా ప్రాంతాల్లో దిష్టిబొమ్మల్ని తగలబెట్టారు. పోస్టర్లు,బ్యానర్లు ,ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం కార్పొరేట్లను బట్టబయలు చేయడమే.
మూడవది: ఇక అధికారంలో ఉన్న బీజేపీ-ఆర్ఎస్ఎస్ తన బ్రహ్మాస్త్రంగా భావించే మతపరమైన విభజన గురించి ప్రస్తావిస్తున్నది. దేశవ్యాప్తంగా ఆరు సరిహద్దులలో జరిగిన సమావేశాల్లో మతపరైన విభజనవల్ల కలిగే అనర్థాలను వివరించారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఎజెండా వెనుక కుట్రను బహిర్గతం చేస్తున్నారు. అలాగే తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నల్లచట్టాలతో కలిగే అనర్థాలను అర్థం చేసుకోవాలని అన్నిమతాలకు చెందిన వారిని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ విధంగా సద్భావన, సామరస్యం గురించి చెప్పటమే కాదు. ఆచరిస్తున్నారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ సైద్ధాంతిక సూత్రీకరణలోకి వెళ్లకుండా, పోరాటంలో మతతత్వమనే విషంతాకకుండా ఉద్యమం కొనసాగుతున్నది.
నాల్గవది: రైతుల ఐక్యతకు నిదర్శనంగా మందసోర్ కాల్పులు జరిగాక.. రైతులంతా ఏకమయ్యారు. అప్పటినుంచి ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) హక్కుల పోరాటం చేస్తున్నది.పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లోని పలు రైతు సంఘాలు, రాష్ట్రీయ కిసాన్ మహాసంఫ్‌ు ఉమ్మడిగా ఉద్యమిస్తున్నాయి. విభిన్న సిద్ధాంతాలు ఉన్నా.. సంఘీభావంతో చేస్తున్న ఈ పోరాటం తిరుగులేనిది.ఈ ఐక్యత ఒక్కరోజులో సాధ్యంకాలేదు.. దీని వెనుక వ్యవసాయ సంక్షోభం ,కార్పొరేట్ ,హిందూత్వ ప్రభుత్వం వెరసి అనాగరిక విధానాలను వేగంగా అమలు చేసే దూకుడును అడ్డుకునేలా అడుగులేస్తున్నది. అయితే దీని వెనుక ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా సహనంతో చేసిన ప్రయత్నాలెన్నో. నాసిక్ నుంచి ముంబయికి కిసాన్ సభ పాదయాత్ర , రాజస్థాన్ రైతుల ఉద్యమం కూడా నల్లచట్టాల వ్యతిరేక ఆందోళనలకు స్ఫూర్తినిచ్చాయి.ఇంతటి ఐక్యతను సృష్టించడమంటే మాటలు కాదు. పైగా దాన్ని నిరంతరం కొనసాగించటం మరింత కష్టం. మోడీ సర్కార్ పెట్టిన ఎన్నో ఇబ్బందులు, వాటికి తోడు ప్రకృతివైపరీత్యాలు వెంటాడుతున్నా..రైతును వెనక్కితగ్గేలా చేయలేకపోయాయి. యునెటైడే కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుతో వర్కింగ్ ఆర్గసైజేషన్లు కదిలాయి. 24 ప్రతిపక్షపార్టీలు భారత్‌బంద్‌కు మద్దతుగా కలిసిరావటం కూడా దేశచరిత్రలో ఇదే మొదటిసారి కావటం విశేషం.
ఐదవది..కార్పొరేట్ అనుకూల విధానాలను
మోడీ ప్రభుత్వం తొలగించాలి. బీజేపీని ఓడించాలి.అనే లక్ష్యంతో ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రైతుల సత్తాఏంటో చాటారు. తాజాగా మిషన్ ఉత్తర ప్రదేశ్-ఉత్తరాఖండ్ పేరుతో సమరశంఖారావం పూరించటానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. సెప్టెంబర్ ఐదు నుంచి బీజేపీకి షాక్ ఇచ్చేలా రంగంలోకి దిగనున్నారు. అదే ఇపుడు బీజేపీ ప్రభుత్వానికి మింగుడుపడటంలేదు. వచ్చే ఎన్నికల్లో రైతు ఉద్యమం ఎక్కడ దెబ్బకొడుతున్నదోనన్న భయంతో మోడీ,సహచరబృందానికి ముచ్చెమటలు పడుతున్నాయి.