Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్ నాటికి ఎయిరిండియా విక్రయం!
- మోడీ సర్కార్ కసరత్తు..
- మెగా ఐపీఓలో విదేశీ సంస్థలకు కీలక వాటా
న్యూఢిల్లీ : పదేపదే స్వదేశీ విధానం, దేశభక్తి ముచ్చట్లు చెప్పే బీజేపీ పాలకులు బంగారు బాతులాంటి ప్రభుత్వరంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లోని వాటాలను విదేశీ శక్తులకు కట్టబెట్టేలా చర్యలు చేపడుతున్నారు. ఎల్ఐసీలోని వాటాలను మెగా ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా మోడీ ప్రభుత్వం ప్రయివేటు శక్తులకు విక్రయించడానికి కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులోని అధిక వాటాను ఒకే ఒక విదేశీ పెట్టుబడిదారుకు విక్రయించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన ఒకరు వెల్లడించారు. ఈ ఎఫ్‌డీఐకి కూడా ఆటోమెటిక్ పద్దతిలో అనుమతులివ్వ నుందని తెలుస్తున్నది. అయితే ఎంత వాటాను అప్పగించేదీ స్పష్టత లేదని పేరు చెప్పుకోవడానికి ఆసక్తిలేని ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 20శాతం వరకు ఎఫ్‌డీఐల పరిమితి విధించాలని ఈనెల ప్రారంభంలో జరిగిన ఓ సమావేశంలో చర్చకు వచ్చింద న్నారు. భారత బీమా సంస్థల్లోకి 74శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. కానీ పార్లమెంట్ చేసిన ప్రత్యేక చట్టం ద్వారా ఇది ఎల్ఐసీకి వర్తించదు. అయితే ఎల్ఐసీలో ఎఫ్‌డీఐల అనుమతికి సంబంధించి చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని ఆ వ్యక్తి తెలిపారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖప్రతినిధి వెంటనే స్పందించడానికి నిరాకరించారు.
వ్యూహాత్మక పెట్టుబడుల కోసం బిడ్డింగ్ ప్రక్రియ
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ఈ ఏడాది డిసెంబర్ నాటికి విక్రయించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) లక్ష్యంగా పెట్టుకుంది. వ్యూహాత్మక పెట్టుబడుల కోసం బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయితే ఈ ఏడాదికే అమ్మేయడం ఖరారైనట్లేనని అధికారులు పేర్కొంటున్నారు.ఇంతకాలం పీఎస్‌యూలను,వాటి వాటాలను మాత్రమే విక్రయిస్తూ వచ్చిన ప్రభుత్వం తాజాగా ప్రజలకు అత్యంత అవసరమైన మౌలిక వసతులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి బీజేపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిన విషయం తెలిసిందే. రోడ్లు, రైళ్లు, విద్యుదుత్పత్తి, సరఫరా నుంచి..గ్యాస్ పైప్ లైన్లు, మైనింగ్, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, మైదా నాల వరకూ అడ్డగోలుగా అమ్మడం ద్వారా సొమ్ము చేసుకోవాలని భావిస్తోంది. ఈ రంగాల విలువైన ఆస్తుల విక్రయం ద్వారా 2022 నుంచి 2025 వరకూ.. అంటే నాలుగేండ్లలో రూ.6 లక్షల కోట్లను సమీకరించేందుకు 'నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌ను (ఎన్ఎంపీ)'ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అన్ని అమ్మేస్తాం.. ఉన్నకాడికి దండుకుంటాం అనే ఈ ప్రమాదకర పద్దతిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.