Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితురాలి మిత్రుడిని కొట్టి.. మైసూర్లో ఘటన
బెంగళూరు: దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. నిత్యం ఏదోఒక చోట వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నాటకలో ఓ వర్సిటీకి చెందిన విద్యార్థినిపై లైంగికదాడి జరగడం సంచలనంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం.. మైసూరులోని ఓ యూనివర్సిటకి చెందిన విద్యార్థిని తన మిత్రుడితో కలిసి నగర శివారులోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం చాముండి హిల్స్‌కు వెళ్లారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తిరిగివస్తుండగా.. కొందరు దుండగులు వారిని చుట్టుముట్టారు. ముందు డబ్బులు ఇవ్వమని బెదిరించారు. బాధితులు వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో వారిపై దాడికి దిగి.. విద్యార్థినిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అలాగే, బాధితురాలి మిత్రుడిని తీవ్రంగా కొట్టారు అని పోలీసులు తెలిపారు. బాధితులు ప్రస్తుతం ఓ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి వాంగ్మూలం తీసుకున్నామనీ, ఐపీసీ సెక్షన్ 376డీ కింద కేసు నమోదుచేశామని తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నదనీ, నిందితులు పరారీలో ఉన్నారనీ, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.