Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టులో విచారణ
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తన పేరు తొలగించడాన్ని నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ సండ్ర వీరయ్య, ఏసీబీ కోర్టుకు ఈ కేసు విచారించే పరిధి లేదంటూ రేవంత్ రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లను బుధవారం జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారించింది. రేవంత్ తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూత్రా, సండ్ర తరపున సీనియర్ న్యాయవాది కె.గులాటిలు వాదనలు వినిపించారు. స్టీఫెన్ సన్ స్టేట్మెంట్లో సండ్ర పేరు లేదని, కేసుతో సండ్రకు సంబంధం లేదని తెలిపారు. ఓటుకు నోటు కేసులో అవినీతి నిరోధక చట్టం ప్రయోగించడం సరికాదనీ, ఈ కేసు ఆ చట్టం కిందకు రాదని సిద్దార్ధ లూత్రా తెలిపారు. అయితే, ఈకేసులో స్టీఫెన్ సన్కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి తదితరులు దొరికారనీ, ఇది అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది హరీన్ రావెల్ తెలిపారు. వాదన అనంతరం హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. మంగళవారం లోగా కౌంటరు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ సెప్టెంబరు 7కు వాయిదా వేసింది.