Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో రూ.15వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)లకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రి వర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. దేశంలో ఎంకరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ హౌల్డింగ్ లిమిటెడ్ రూ.15 వేల కోట్ల ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఎఫ్‌డీఐతో మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగా నికి, విమానాశ్రయ రంగానికి పెద్ద ప్రోత్సాహకరంగా ఉంటుందని కేంద్రం తెలిపింది. అలాగే చెరకు మద్దతు ధరను (ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ధర ఎఫ్ఆర్పీ) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఏడాది చక్కెర సీజన్ కోసం చెరుకు మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.290కి పెంచుతూ ఆమోద ముద్ర వేసింది. కేంద్ర మంత్రి వర్గ సమావేశం అనంతరం నేషనల్ మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ మాట్లాడారు. 10 శాతం రికవరీ ఆధారంగా చెరకుపై ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ధర (ఎఫ్ఆర్పీ) క్వింటాలుకు రూ.290కు పెంచాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. రైతు రికవరీ 9.5 శాతం కంటే తక్కువగా ఉంటే, క్వింటాలుకు రూ.275.50 లభిస్తుందని గోయల్ అన్నారు. కాగా ఇంతకుముందు చెరకు ఎఫ్ఆర్పీ క్వింటాల్‌కు రూ.285గా ఉండేది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చెరకు మద్దతుధర క్వింటాలుకు రూ.5 పెరిగింది. చెరకు క్రషింగ్ సీజన్ ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎఫ్ఆర్పీని ప్రకటిస్తుంది. చెరకు సాగుదారులకు షుగర్మిల్లులు ఈ కనీస ధర తప్పనిసరిగా చెల్లించాలి. 2020-21లో సుమారు రూ.91వేల కోట్లు విలువ చేసే 2,976 లక్షల టన్నుల చెరకును రైతుల నుంచి షుగర్ మిల్స్ కొనుగోలు చేశాయి. వీటికి సంబంధించి చెరకు రైతులకు రూ. 91,000 కోట్లు చెల్లించాల్సి ఉండగా, అందులో రూ.86 వేల కోట్లు ఇప్పటివరకు చెల్లించామని పియూష్ గోయల్ తెలిపారు. అయితే రాబోయే చక్కెర సీజన్ 2021-22లో చెరకు ఉత్పత్తిలో పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని షుగర్ మిల్స్ దాదాపు 3,088 లక్షల టన్నుల చెరకును కొనుగోలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు.