Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పెగాసస్' విచారణపై ప.బెంగాల్‌కు సుప్రీం సూచన
న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన 'పెగాసస్ కుంభకోణం'పై ప.బెంగాల్ ప్రభుత్వం న్యాయ విచారణకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. తాము చెప్పేవరకూ న్యాయ విచారణ మొదలుపెట్టరాదని, కొంతకాలం ఆగాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది. పెగాసస్ కుంభకోణంపై దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తుండగా, సమాంతరంగా మరో కోర్టు విచారణ జరపటాన్ని సవాల్ చేస్తూ..ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు ప.బెంగాల్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయటాన్ని పిటిషన్‌దారు తప్పుబట్టారు. సీజేఐ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌పై విచారణ జరిపి పై ఉత్తర్వులను జారీచేసింది.
పెగాసస్ కుంభకోణం దాఖలైన పిటిషన్లన్నీ ఇప్పుడు సుప్రీం ముంగిట ఉన్నాయి. వీటిపై సమగ్రమైన తుది తీర్పు వెలువడ్డాక విచారణపై ముందుకు వెళ్లవచ్చునని తాజా ఉత్తర్వుల్లో సుప్రీం తెలిపింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకుర్, కలకత్తా హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ జ్యోతిర్మయి భట్టాచార్యలతో ప.బెంగాల్ ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటుచేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ న్యాయ విచారణపై ముందుకు వెళ్లరాదని, కొంతకాలం ఆగాలని సుప్రీం తాజాగా పేర్కొంది. వచ్చే వారం తమ ముందున్న పిటిషన్లపై విచారణ చేపడతామని సమగ్రమైన ఆదేశాలు జారీచేస్తామని సుప్రీం తెలిపింది. పెగాసస్ కుంభకోణంలో వాస్తవాల్ని బయటపెట్టేందుకు విచారణకు ప్రత్యేక కమిటీ వేయాల్నా? అన్నదానిపై సుప్రీం నిర్ణయం తీసుకోనున్నది.