Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ నిపుణుల కమిటీ సిఫారసు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఆంక్షల్లో పలు సడలింపులు ప్రకటించాయి. ఈ క్రమంలోనే పాఠశాలలు సైతం తిరిగి ప్రారంభిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో పాఠశాలలు పున:ప్రారంభంపై ఏర్పాటు చేసిన ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీఎంఏ) నిపుణుల కమిటీ కీలక సిఫార్సులు చేసినట్టు సమాచారం. ఈ ప్యానెల్ బుధవారం సమర్పించిన తన నివేదికలో అన్ని తరగతుల పాఠశాలలను తిరిగి తెరవాలని సిఫార్సు చేసింది. అయితే, ఇది దశలవారీగా ఉండాలని సూచించింది. మొదట సీనియర్ విద్యార్థులను పాఠశాలలకు అనుమతించాలనీ, ఆ తర్వాత మధ్య తరగతి విద్యార్థులు, చివరగా ప్రథమిక తరగతులను ప్రారంభించాలని పేర్కొంది. ''ప్యానెల్ బుధవారం తన నివేదికను సమర్పించింది. సిఫార్సుల్లో అన్ని తరగతులకు పాఠశాలలను తిరిగి తెరవాలని సూచించింది. అయితే, ఇది దశల వారీగా ఉంటుంది. ఈ నివేదికను సవిస్తరంగా అధ్యయనం చేసి, దీనికి సంబంధించి త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు' అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కాగా, ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రుల సమ్మతితో 10, 11, 12 తరగతుల విద్యార్థులు అడ్మిషన్, బోర్డు ఎగ్జామ్స్ సంబంధిత కార్యకలాపాల కోసం పాఠశాలలను సందర్శంచవచ్చు. ఇప్పుడు తిరిగి బడులను ప్రారంభించడంలో ఎలాంటి హానీ లేదని పేర్కొన్న ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజల్.. ఈ అంశంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆగస్టు 6న అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే నిపుణుల కమిటీ ఏర్పాటైంది. కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్డౌన్కు ముందు ఢిల్లీలో పాఠశాలలు మూసివేయబడ్డాయి.