Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమానికి నేటికి తొమ్మిది నెలలు
- నేడు రైతు జాతీయ కన్వెన్షన్‌కు రెడీ
- దేశవ్యాప్తంగా 1,500 మంది ప్రతినిధులు
న్యూఢిల్లీ: మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనీ, అన్ని పంటలకు కనీస మద్దతు ధర సీ2ం50 శాతం వద్ద చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న చారిత్రాత్మక పోరాటం గురువారం నాటికి తొమ్మిది నెలల మైలురాయిని చేరుకోనున్నది. ఈ శాంతియుత ఆందోళనలో లక్షలాది మంది రైతులు భాగస్వామ్యమయ్యారు. దేశంలోని రైతుల సమస్యలు, వారి భవిష్యత్తును ఈ ఉద్యమం వల్లనే బహిరంగ చర్చకు దారితీసింది. ఈ ప్రజా ఉద్యమం ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తిపై విశ్వాసాన్ని పునరుద్ధరించింది. ఇది దేశ రాజకీయాల్లో గౌరవప్రదమైన గుర్తింపును తిరిగి పొందడంలో రైతులకు సహాయపడింది. దేశంలోని వ్యవసాయ సంఘాల మధ్య ఐక్యత, సమిష్టి స్ఫూర్తిని ఏర్పరచడంలో సహాయపడింది. ఈ పోరాటం రైతుల సంఘాల మధ్య కులం, మతం, ప్రాంతం, రాష్ట్రం, ఇతర వైవిధ్యాలను అధిగమించింది. రైతులు, ఇతర సాధారణ పౌరులకు మద్దతుగా కలిసి పనిచేయడానికి ఈ ఉద్యమం దేశంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీలను ఏకం చేసిందని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తెలిపింది. ఈ ఉద్యమం ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే పౌరుల ప్రాథమిక హక్కును తిరిగి స్థాపించింది. ఇది దేశంలో అనేక స్థానిక రైతుల పోరాటాలకు శక్తి ని, మద్దతును అందించగలిగింది. విజయవంతమైన పరిష్కారం దిశగా అనేక చర్యలు తీసుకుందని ఎస్కేఎం పేర్కొంది.
నేటి నుంచి రైతు జాతీయ కన్వెన్షన్
ప్రపంచంలోనే అతిపెద్ద, సుదీర్ఘమైన శాంతియుత పోరాటం తొమ్మిది నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సింఘు బోర్డర్లో నేడు, రేపు (గురు, శుక్ర వారాల్లో) ఎస్‌కెఎం జాతీయ కన్వెన్షన్ జరగనున్నది. దేశంలోని 20 రాష్ట్రాల నుంచి 1,500 మంది ప్రతినిధులు ఈ కన్వెన్షన్‌లో పాల్గొంటారు. దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు, విస్తరించేందుకు జరిగే ఈ కన్వెన్షన్‌ను రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ ప్రారంభిస్తారు. ఈ కన్వెన్షన్‌లో ఐదు సెషన్లు ఉంటాయి. మొదటి రోజు మూడు, రెండో రోజు రెండు సెషన్లు ఉంటాయి. మొదటి రోజు పారిశ్రామిక కార్మికులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, గిరిజన ప్రజలపైన, రెండో రోజు మహిళలు, విద్యార్థులు, యువత, ఇతర రంగాల్లో పని చేసే వారికి సంబంధించి చర్చ జరగనున్నది. ఈ కన్వెన్షన్‌లో కార్మిక, ప్రజాస్వామ్య ఉద్యమాలకు నాయకత్వం వహించే సంఘాల నుంచి పాల్గొంటారు. వీటిలో రైతులు, భూమిలేని, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, గిరిజన ప్రజలు, పారిశ్రామిక కార్మికులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు, మాజీ సైనికులు, ఉపాధ్యాయులు, వైద్య నిపుణులు, న్యాయవాదులు, ఇతరులు ఉన్నారు. దేశమంతటా ఉద్యమ తీవ్రతరం, విస్తరణ కోసం పాల్గొనేవారి నుండి వచ్చిన సూచనల ప్రకారం కన్వెన్షన్ ఒక కార్యాచరణ ప్రణాళికను ఆమోదిస్తుంది.
రైతుల డిమాండ్లు
మూడు రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల చట్టాలు రద్దు చేయాలనీ, సీ2ం50 శాతం వద్ద ఎంఎస్పీ చట్టం చేయాలని డిమాండ్ చేస్తుంది. విద్యుత్ బిల్లును రద్దు వెనక్కి తీసుకోవాలనీ, ఎన్సీఆర్, అనుబంధ ప్రాంతాల బిల్లులో భాగంగా గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ కింద రైతులపై విచారణ వద్దని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశ ప్రజలను ఆందోళనకు గురిచేసే ఇతర సమస్యలపై సహాయక తీర్మానాలను కూడా ఈ కన్వెన్షన్ చర్చిస్తుంది. మూడు కార్మిక కోడ్లు, ఉపాధి హామీ, ఇంధన, ఎరువుల ధరల పెరుగుదల, మహిళపై దాడులు, విద్య ప్రయివేటీకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆదివాసీల తొలగించడం, అటవీ హక్కుల చట్టం, చిన్న దుకాణదారులపై దాడులు, భూ సేకరణ, భూమి హక్కులు, ప్రజాస్వామ్య హక్కులపై దాడులవంటి అంశాలపై చర్చ జరుగుతుంది.
కొనసాగుతున్న బీజేపీ నేతల బహిష్కరణ
బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలకు వ్యతిరేకంగా సామాజిక బహిష్కరణ, నల్ల జెండాలతో నిరసన పిలుపు కొనసాగుతోందని ఎస్కేఎం స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ పిలిభిత్‌లోని పురన్‌పూర్ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ స్థానిక రైతులు నల్ల జెండాలతో నిరసనలకు దిగారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్ మంత్రి మహేశ్ చంద్ర గుప్తాకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేశారు. నల్ల జెండాలతో నిరసనకు దిగారు. మరో మంత్రి బల్దేవ్ సింగ్ ఉలాఖ్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో ఆందోళన చేసిన 70 మంది రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రైతుల అనుమతి లేకుండా పీపీపీలో భాగంగా తప్పనిసరిగా భూసేకరణ చట్టం (ఎల్ఆర్ఆర్-2013) సవరణకు హర్యానా ప్రభుత్వం తీసుకున్న చర్యను ఎస్కేఎం ఖండించింది. ఈ సవరణ 2015లో మోడీ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందనీ, రైతు వ్యతిరేక సవరణలను బ్యాక్ డోర్ నుంచి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని విమర్శించింది. ఇది 2013లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన చారిత్రాత్మక చట్టాన్ని బలహీనపరుస్తుందని ఆగ్రహం వ్యక్తంచేసింది.
మరోవైపు దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు వేలాది మంది రైతులు చేరుకుంటున్నారు. రాజస్థాన్‌లోని వివిధ జిల్లాల నుంచి రైతులు పెద్ద ఎత్తున షాజహాన్‌పూర్ సరిహద్దుకు చేరుకున్నారు. ఆందోళనను మరింత బలోపేతం చేయడానికి ఆగస్టు 29న హర్యానాలోని నుV్‌ాలో ఒక పెద్ద మహా పంచాయత్ షెడ్యూల్ చేయబడింది.