Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ, ఎమ్మెల్యేల క్రిమినల్ కేసుల పెండింగ్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- ఏండ్లు గడిచినా ఛార్జ్షీట్లు దాఖలు చేయరా?
- ఆస్తుల అటాచ్ చేయడంతో ప్రయోజనం లేదు
- కేసుల దర్యాప్తు జాప్యంపై సీబీఐ, ఈడీకి కారణం లేదు
- దర్యాప్తులో విపరీత జాప్యాన్ని నివారించేందుకు ఓ విధానాన్ని రూపొందించాలి
- అమికస్ క్యూరీ నివేదిక అసంపూర్తిగా ఉంది : సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ : ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. చాలా కేసుల్లో కనీసం ఛార్జ్షీట్లు దాఖలు చేయకపో వడానికిగల కారణాలు చెప్పలేని ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సం స్థల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఛార్జ్షీట్లు లేకుండా కేవలం ఆస్తులు జప్తు చేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించింది. ఛార్జ్షీట్లు దాఖలు చేయాలని హితవుపలికింది. పార్లమెంటు సభ్యులు (ఎంపీలు), శాసనసభ సభ్యులు (ఎమ్మెల్యేలు)లపై కేసుల విచారణ ను వేగవంతం చేయడానికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ, న్యాయ మూర్తుల కొరత కారణంగా అటువంటి ఆదేశాలను అమలు చేయ డం అంత సులభం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రత్యేక కోర్టుల ను ఏర్పాటు చేయడం ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను త్వరగా విచారించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యారు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అమికస్ క్యూరీ విజరు హన్సారియా.. ఎంపీ, ఎమ్మెల్యేలపై విచారణ స్థితిగతుల వివరాలతో కూడిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. అటువంటి విచారణ త్వరితగతిన ముగిసేలా చూసేందుకు ఆయన పలు సూచనలు కూడా చేశాడు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. 'ఇది చాలా విచారకరం. నివేదిక అసంపూర్తిగా ఉంది. విచారణలో విపరీతమైన జాప్యాన్ని నివారించడానికి ఒక విధానాన్ని రూపొందించాలి' అని ధర్మాసనం పేర్కొంది. ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు విచారణను వేగవంతం చేయడం, చేయాలని చెప్పడం సులభమే, కానీ న్యాయమూర్తుల సమస్య కూడా ఉన్నదని తెలిపింది.
ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విచారణలో జాప్యానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వంటి దర్యాప్తు సంస్థలు కారణాలు వివరించలేదని పేర్కొంది. 'మేం ఏజెన్సీల గురించి ఏమీ చెప్పదలచుకోలేదు. ఎందుకంటే వాటి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలను మేం అనుకోవటంలేదు. న్యాయమూర్తుల లాగా వారికీ అధిక భారం ఉంది. కాబట్టే సంయమనం పాటిస్తున్నాం. సీబీఐ కోర్టుల్లో 300 నుంచి 400 కేసులున్నాయి. ఇవన్నీ ఎలా చేయాలి? క్షమించండి మిస్టర్ మెహతా (సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా).. మీ నివేదిక అసంపూర్తిగా ఉన్నది. 10 నుంచి 15 ఏండ్ల పాటు ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడానికి ఎటువంటి కారణం లేదు. మనీలాండరింగ్ కేసుల్లో చాలా వాటిల్లో ఈడీ కేవలం ఆస్తులు జప్తు చేయడం మినహా ఎలాంటి దర్యప్తు చేపట్టలేదు. కేవలం ఆస్తులను అటాచ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు రూ.200 కోట్లు విలువైన ఆస్తులను జత చేసిన ఒక కేసు ఉంది. కానీ ఇప్పటి వరకు చార్జిషీటు దాఖలు చేయలేదు. ప్రత్యేకించి ఈడీలో ఏమీ ముందుకు సాగడంలేదు' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
దీనికి సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా బదులిస్తూ.. చాలా కేసుల్లో దర్యాప్తులపై హైకోర్టులు స్టే విధించాయనీ, అందుకే ఆలస్యమవుతున్నాయని అన్నారు. అయితే ఎస్జీ సమాధానం పట్ల సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. కేవలం 8 కేసుల్లో మాత్రమే కోర్టుల నుంచి స్టే ఉత్తర్వులు ఉన్నాయని అన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను అలాగే వదిలేయడం సరికాదనీ, కనీసం ఛార్జ్‌షీట్లయినా దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో దర్యాప్తు పూర్తి చేయడానికీ, విచారణ ముగిసేందుకు బాహ్య పరిమితిని నిర్ణయించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. 'ఎక్కడ విచారణ జరుగుతున్నా ఆరు నెలల బాహ్య పరిమితిలో దర్యాప్తు ముగించాలని నిర్దేశించండి. విచారణ ముగియడానికి తప్పనిసరి సమయాన్ని సెట్ చేయండి' అని ఆయన ధర్మాసనానికి తెలిపారు.
సీబీఐ, ఈడీ డైరెక్టర్లు ఎంత అదనపు శక్తి అవసరమో తెలియజేయాలని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ''మానవశక్తి నిజమైన సమస్య. మనలాగే దర్యాప్తు సంస్థలు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నాయి. ప్రతిఒక్కరూ మాకు సీబీఐ దర్యాప్తు కావాలని కోరుకుంటున్నారు'' అని సీజేఐ రమణ తెలిపారు. జడ్జిల సంఖ్య, మౌలిక సదుపాయాలు సమస్యగా మారుతున్నాయని అన్నారు. దీన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తామని తెలిపారు.
అమికస్ క్యూరీ నివేదికలో ఏముంది..?
మనీలాండరింగ్ కేసుల్లో తాజా, మాజీలు కలిపి 51 మంది ఎంపిలు, 71 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిందితులుగా ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇందులో ఎంత మంది మాజీలు, ఎంత మంది ప్రస్తుత ప్రజా ప్రతినిధులనేది స్పష్టత ఇవ్వలేదు. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)-2002 పరిధిలోని వివిధ కేసుల్లో ఉన్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టుల్లో 151 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని నివేదిక తెలిపింది. 58 పెండింగ్ కేసుల్లో జీవిత ఖైదు పడే అవకాశముందని పేర్కొంది. 45 కేసుల్లో అభియోగాలు కూడా నమోదు కాలేదని వెల్లడించింది. అయితే 19 మంది ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విచారణలో అసాధారణ జాప్యం జరుగుతుంది.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఈడీ కేసులు
ఎంపీలపై మొత్తం 51 కేసులను ఈడీ నమోదు చేసింది. అందులో 28 కేసుల దర్యాప్తు పెండింగ్‌లో ఉంది. రెండు కేసులు విచారణ దశలో ఉన్నాయి. 10 కేసులు ఛార్జ్షీట్లు దాఖలు దశలో ఉన్నాయి. విచారణ పెండింగ్‌లో నాలుగు కేసులున్నాయి. రెండు కేసులు హైకోర్టుల్లో స్టే ఇచ్చాయి. ఒక కేసులో సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. మూడు కేసులు అప్పీలు, డిశ్చార్జి రివిజన్ దశలో ఉన్నాయి. ఒకకేసులో నిందితుడు మరణించారు. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై 71 కేసులు నమోదు కాగా, 48 కేసుల్లో దర్యాప్తు పెండింగ్‌లో ఉంది. 15 కేసులు ఛార్జ్‌షీట్ దాఖలు దశలో ఉన్నాయి. మూడు కేసుల్లో విచారణ పెండింగ్‌లో ఉంది. రెండు కేసుల్లో హైకోర్టు, సుప్రీం కోర్టులు స్టే విధించాయి. ఒక కేసులో సుప్రీం కోర్టు స్టే విధించింది. రెండు కేసులు వివిధ దశల్లో ఉన్నాయి. దాని ప్రకారం ఎమ్మెల్యేలపై 121 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఎంపీ, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసులు
ఎంపీ, ఎమ్మెల్యేలపై సీబీఐ మొత్తం 121 కేసులను నమోదు చేసింది. అందులో 51 మంది (14 మంది ప్రస్తుతం, 37 మంది మాజీ, 5 మంది మరణం) ఎంపీలు నిందితులుగా ఉన్నారు. 112 మంది ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారు. అందులో 34 మంది ప్రస్తుతం, 78 మంది మాజీలు ఉండగా, 9 మంది మరణించారు. ఎంపీ ఎమ్మెల్యేలపై 37 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో 17 మంది ఎంపీలు ఉండగా, 5 మంది ప్రస్తుత, 12 మాజీ, ఇద్దరు చనిపోయిన వారు ఉన్నారు. 17 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో 11 మంది ప్రస్తుత, 6 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
అమికస్ క్యూరీ సూచనలు...
పెండింగ్ కేసులను రోజువారి విచారణలు చేపట్టాలని కోర్టులను ఆదేశించాలి. సీబీఐ, ఈడీ పరిధిలోని కేసులను విచారించాలని సంబంధిత కోర్టును హైకోర్టు ఆదేశించాలి. ఈ కేసుల పూర్తి తరువాత ఇతర కేసులను విచారించాలి. అదనపు కోర్టులు అవసరమైతే హైకోర్టులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. వాయిదాలు కోరకుండా, సాక్షులను నిర్దేశిత తేదీల్లో ప్రవేశపెట్టేలా సీబీఐ చూడాలి. విచారణకు సహకరించకపోతే వారి బెయిల్‌ను రద్దు చేసే అంశాన్ని కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన కేసులను నిర్దేశిత కాల పరిమితుల్లో విచారించాలని హైకోర్టులను అభ్యర్థించాలి. సీబీఐ, ఈడీ పరిధిల్లోని కేసుల దర్యాప్తు జాప్యంపై పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలి. ఈ కమిటీల్లో హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తి, ఈడీ డైరెక్టర్, సీబీఐ డైరెక్టర్ (లేకపోతే వారుచూపిన అదనపు డైరెక్టర్ హౌదాకు తగ్గని అధికారి), కేంద్ర హౌం శాఖ కార్యదర్శి (లేకపోతే ఆయన సూచించిన సంయుక్త కార్యదర్శి హోదాకు తగ్గని అధికారి), హైకోర్టు చూచించిన జిల్లా జడ్జి హోదాకు తగ్గని న్యాయాధికారి సభ్యులుగా ఉండాలి. ఆ కమిటీ దర్యాప్తు అధికారికి కేసుల విచారణ జాప్యంపై సూచనలు చేయాలి. ఈ కమిటీని ఉత్తర్వలు జారీ చేసిన రెండు వారాల్లో నియమించాలి. కమిటీ తొలి సమావేశమైన రెండు నెలల్లోపు ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను హైకోర్టుకు సీల్డ్ కవర్లో అందజేయాలి.
ముజఫర్‌నగర్‌లో 77 అల్లర్ల కేసులు ఉపసంహరణ
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ అల్లర్లకు సంబంధించిన 2013లో 510 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 77 కేసులను ఎటువంటి కారణం లేకుండానే యోగి ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. ఈ 510 కేసుల్లో మీరట్ జోన్‌లోని ఐదు జిల్లాల్లో 6,869 మంది నిందితులు ఉన్నారని తెలిపింది. 175 కేసుల్లో ఛార్జ్షీట్లు దాఖలు చేశారనీ, 165 కేసుల్లో తుది రిపోర్టు సమర్పించారని పేర్కొంది. 170 కేసులు రద్దు చేశారని, 77 కేసులు ఉపసంహరిం చుకు న్నారని తెలిపింది. కర్నాటకలో 62 కేసులు, తమిళనాడులో 4, తెలంగాణలో 14 కేసులు ఉపసంహరించుకు న్నట్టు అమికస్ క్యూరీ తన నివేదికలో తెలిపారు.