Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితుడికి బెయిల్ మంజూరును ఖండించిన ఐద్వా
- న్యాయాన్ని అపహాస్యం చేయడమే: బాధితురాలు
న్యూఢిల్లీ: ఐఐటీ గౌహతిలో సహచర విద్యార్థినిపై ఓ బీటెక్ స్టూడెంట్ లైంగికదాడికి పాల్పడగా.. నిందితుడికి ఇటీవల గౌహతి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బాధితురాలు, నిందితుడు ఉన్నత విద్యావంతులుగా సమాజంలోకి అడుగుపెట్టనున్నారని వారు రాష్ట్రానికి భవిష్యత్ ఆస్తులని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేయడాన్ని ఖండిస్తూ తాజాగా ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) ఓ ప్రకటన విడుదల చేసింది. లైంగికదాడి నిందితుడికి బెయిల్ ఇవ్వడాన్ని ఖండించింది. అలాగే, నిందితుడు, బాధితురాలు ఒకే క్యాంపస్ చెందినవారు కావడంతో బాధితురాలిపై కేసుకు సంబంధించి ఒత్తిడి తీసుకువచ్చే అకాశాన్ని ప్రస్తావించింది. అత్యంత తీవ్రమైన నేరం చేసిన వ్యక్తిని కనీస శిక్ష విధించిన సందర్భంలో చాలా సులభంగా బయటకు పంపించడం బాధాకరమని తెలిపింది. లైంగికవేధింపులు, దాడులకు సంబంధించిన నేరాలు ఎంత ఘోరంగా ఉంటాయో, నిందితుల వికృత వైఖరిని ప్రతిబించే చర్యలకు సంబంధించి విషయాలను కోర్టులు పరిగణించాలనే అభిప్రాయాన్ని ఐద్వా విశ్వసిస్తున్నదని తెలిపింది.ఇదిలా ఉండగా, కోర్టు చేసిన వ్యాఖ్యలపై బాధితురాలు అభ్యంతరం వ్యక్తం చేసింది. తనపై లైంగికదాడికి పాల్పడిన వాడు భవిష్యత్ ఆస్తి ఎలా అవుతాడని ప్రశ్నించింది. ఇది ముమ్మాటికీ న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని బాధితురాలు ఆరోపించింది. అతడు ఐఐటీ స్టూడెంట్ అని కోర్టు భావిస్తే.. తాను కూడా ఐఐటీ స్టూడెంట్‌నే అని కోర్టు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికింది. తన లాంటి వారు మరింత మంది అన్యాయానికి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసింది.