Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వహణకు అరకొర నిధులు
- కేంద్రీయ విశ్వవిద్యాలయం మూడో వార్షికోత్సవం
- నిధులు కేటాయించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య సూచన
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్యవిద్యాలయం అనంతపురంలో ప్రారంభమై మూడేళ్లు పూర్తయింది. విభజన హామీల్లో భాగంగా 2018 ఆగస్టు 18న దీనిని ప్రారంభించారు. అదే సంవత్సరం తరగతులు అనంతపురంలోని జెఎన్‌టియులో ప్రారంభమైన ప్పటికీ ఇప్పటికీ సొంత క్యాంపస్‌కు నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలోనే కేంద్రీయ విశ్వవిద్యాలయం క్యాంపస్ నిర్మాణానికి 491 ఎకరాలను బుక్కరాయసముద్రం మండలం జంతలూరు వద్ద కేటాయించింది. నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 2021-22లో రూ.1.26 కోట్లు, 2020-21లో రూ.8 కోట్లు, 2019-20లో రూ.4.8 కోట్లు మాత్రమే కేటాయించింది. నిధుల కేటాయింపు ఇలాగే ఉంటే ఎప్పటికి విశ్వవిద్యాలయం పూర్తి స్థాయిలో ఏర్పాటవుతుందంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి సుభాస్ సర్కారు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి ఈ విశ్వవిద్యాలయ మూడో వార్షికోత్సవ సభలో అనంతపురం ఎంపి తలారి రంగయ్య తీసుకెళ్లారు. గురువారం నాడు అనంతపురం జెఎన్టియు వైస్ ఛాన్సలరు ఛాంబరులోని వీడియో కాన్ఫరెన్సు హాలు నుంచి వర్చువల్ పద్ధతిలో మూడో వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథి వెంకయ్యనాయుడు వర్చువల్‌గా మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయం అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి సుభాస్ సర్కారుకు సూచించారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని అభివృద్ధికి తోడ్పాటునందివ్వాలన్నారు. అంతర్జాతీయ సవాళ్లను అధిగమించే విధంగా విద్యా విధానం ఉండాలని పేర్కొన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎస్.ఎ.కోరి అధ్యక్షతన జరిగిన ఈ వార్షికోత్సవంలో కేంద్ర మంత్రి సుభాస్ సర్కారు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య ప్రసంగించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ అప్పారావు, జెఎన్టియు వైస్ ఛాన్సలర్ రంగ జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.