Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఫ్ఘన్ ఎంపీ రంగినా కర్గార్
న్యూఢిల్లీ : అధికారిక/దౌత్యపరమైన పాస్‌పోర్టు ఉన్నప్పటికీ భారత అధికారులు తనను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెనక్కు పంపించేశారని ఆఫ్ఘనిస్తాన్ మహిళా ఎంపి రంగినా కర్గార్ పేర్కొన్నారు. ఫర్యాబ్ ప్రావిన్స్ నుంచి ఆమె ఆఫ్ఘనిస్తాన్ దిగువసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకున్న ఐదు రోజుల తర్వాత ఈనెల 20న టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీకి రాగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అడ్డుకుని దేశంలోకి అనుమతించలేదు. ఆఫ్ఘనిస్తాన్‌తో, ఆ దేశ ప్రజలతో కాపాడుకోవడంపై దృష్టి పెడుతున్నామని భారత విదేశాంగ శాఖ ఎస్.జయశంకర్ పేర్కొన్న తరువాతి రోజునే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. తాను గతంలో ఎన్నోసార్లు ఈ పాస్ట్పోర్టుపై భారత్‌కు వచ్చానని, ఎన్నడూ లేని విధంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు వేచి ఉండాలని, ఉన్నతాధికారులను సంప్రదించాలని చెప్పినట్లు తెలిపారు. రెండు గంటల తర్వాత.. దుబాయి వయా ఇస్లామాబాద్ నుండి వచ్చిన అదే విమానంలో తిరిగి పంపించేశారు. 'వారు నన్ను బహిష్కరించారు. నన్ను నేరస్థునిగా చూశారు. దుబాయిలో కూడా పాస్‌పోర్టు ఇవ్వలేదు. ఇస్తాంబుల్ వెళ్లాక తిరిగి ఇచ్చారు' అంటూ వ్యాఖ్యానించారు. తన పట్ల అధికారులు ప్రవర్తించిన తీరు సరైంది కాదని అన్నారు. కాబూల్‌లో పరిస్థితులు తలకిందులవ్వడంతోనే... ఆఫ్ఘాన్ మహిళలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందన్న ధైర్యంతో అక్కడకు చేరుకున్నానని అన్నారు. తనను ఎందుకు దేశంలోకి అనుమతివ్వలేదో కారణం చెప్పలేదని తెలిపారు. కాగా ఎంపీ రంగినా కర్గార్కు అనుమతి నిరాకరించిన రెండు రోజుల తర్వాత ఇద్దరు ఆఫ్ఘాన్ ఎంపీలు నరేంద్ర సింగ్ ఖలాసా, అనార్కలి కౌర్ హౌనాయర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానంలో భారత్‌కు చేరుకున్నారు. దీనిపై కర్గార్ స్పందిస్తూ...అవి ఆఫ్ఘాన్ల కోసం ఏర్పాటు చేసిన విమానం కాదని, అయినప్పటికీ వారు రాగలిగారని అన్నారు. తాను భారత్‌కు వచ్చిన రోజు ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నానని, 23న తిరిగి ఇస్తాంబుల్ వెళ్లేందుకు టికెట్ కూడా తీసుకున్నట్టు తెలిపారు.