Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్నారులను ఆదుకోండి
- తల్లిదండ్రుల కోల్పోయిన పిల్లలకు విద్యా భద్రత హామీ ఇవ్వండి
- ప్రయివేట్ విద్యా సంస్థలతో మాఫీ చేయించండి
- లేదంటే ప్రభుత్వాలే ఖర్చును భరించాలి
- బాలల కమిటీలతో సమన్వయం చేసుకోవాలి
- రాష్ట్రాలు ప్రత్యేక చొరవ చూపాలి : సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల చదువు మధ్యలో ఆగిపోకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ ఏడాది చదువు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఆయా చిన్నారుల విద్యా ఫీజులను మాఫీ చేయాలని ప్రయివేటు యాజమాన్యాలను కోరాలని సూచించింది. లేదంటే సగం ఖర్చు ప్రభుత్వాలు భరించాలని పేర్కొంది. 'చిన్నారుల రక్షణ నిలయాల్లో కరోనా వైరస్ వ్యాప్తి' సుమోటో కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. మార్చి 2020 నుంచి అనాధలైన లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన చిన్నారులు విద్యా భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. కనీసం ప్రస్తుత విద్యా సంవత్సరమైనా ఆయా చిన్నారుల చదువు కొనసాగేలా చూడాలని తెలిపింది. ''ఈ విద్యా సంవత్సరంలో ఆయా చిన్నారుల విద్యకు ఆటంకం రాకుండా చూసేలా వారు చదువుతున్న ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడడానికి బాలల సంక్షేమ కమిటీలు, జిల్లా విద్యాశాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలి'' అని రాష్ట్రాలకు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్రాలు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపింది. తల్లిదండ్రులు లేదా ఎవరినైనా ఒకరిని కోల్పోయిన చిన్నారులను గుర్తించడం ప్రారంభిస్తే వారికి కావాల్సిన అవసరాలు తెలుసుకునే వీలుకలుగుతుందని ధర్మాసనం అభిప్రా యపడింది. చిన్నారులను ఆదుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా అమికస్ క్యూరీ గౌరవ్ అగర్వాల్ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రాలకు సుప్రీం కోర్టు పలు సూచనలు చేసింది. తెలంగాణలో సోషల్ ఇన్వెస్టిగేషన్ నివేదిక(ఎస్ఐఆర్)ల ఆధారంగా 914 మంది తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయారు. వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉంది. ఈ నివేదికను త్వరగా ఫైనలైజ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.