Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్కేఎం జాతీయ కన్వెన్షన్ పిలుపు
- పాల్గొన్న 22 రాష్ట్రాల ప్రతినిధులు
- తొమ్మిది నెలలు పూర్తయిన రైతుల ఆందోళన
- అన్ని డిమాండ్లు నెరవేరేవరకూ ఉద్యమం ఆగదు : రైతు నేతలు
న్యూఢిల్లీ : రైతులు మరోసారి భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 25న భారత్ బంద్ తీర్మానాన్ని కిసాన్ జాతీయ కన్వెన్షన్ ఏకగ్రీవంగా ఆమోదించింది. మూడు నల్ల చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ప్రారంభమై తొమ్మిది నెలలు పూర్తి అయిన నేపథ్యంలో సింఘూ సరిహద్దు వద్దు కిసాన్ జాతీయ కన్వెన్షన్ గురువారం జరిగింది. ఈ చారిత్రాత్మక కన్వెన్షన్‌లో 300కి పైగా రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, 18 కార్మిక సంఘాలు, 9 మహిళ సంఘాలు, 17 విద్యార్థి, యువజన సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 22 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కన్వెన్షన్‌ను రైతు నేత రాకేష్ టికాయిత్ ప్రారంభించారు. అన్ని డిమాండ్లు నెరవేరే వరకు శాంతియుతంగా నిరసన కొనసాగాలనే రైతుల సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని విస్తరించాలని, తీవ్రతరం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా మాట్లాడుతూ దేశంలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగే ఈ రైతు పోరాటంలో 600 మంది అమరవీరులు అయ్యారని, వారి స్ఫూర్తితో ఉద్యమాన్ని ఉధతం చేయాలని అన్నారు. ప్రపంచం, భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా శాంతియుతంగా రైతు ఉద్యమం తొమ్మిది నెలలుగా కొనసాగుతున్నదని అన్నారు. అనంతరం కన్వెన్షన్ అర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ ఆశిష్ మిట్టల్ రైతు ఉద్యమంలో అమరవీరులకు నివాళులర్పిస్తూ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.తరువాత మూడు సెషన్లు జరిగాయి. మొదటిది నేరుగా మూడు నల్ల చట్టాలకు సంబంధించినది, రెండోది పారిశ్రామిక కార్మికుల సమస్యలకు సంబంధించినది, మూడోది వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, గిరిజన సమస్యలకు సంబంధించినది.రెండవ సెషన్లో కార్మిక సంఘాల నేతలు నాలుగు లేబర్ కోడ్లను అప్రజాస్వామిక,ప్రజా వ్యతిరేకంగా తీసుకొచ్చారని విమర్శించారు. రైతులు,కార్మికులు,వ్యవసాయ కార్మికులు,ఆదివాసీలు,సామాన్య ప్రజలతో ఐక్యంగా ఉద్యమాన్ని విస్తరింపచేసేందుకు మూడో సెషన్లో వక్తలు సూచనలు చేశారు. తద్వారా రైతు ఉద్యమ పరిధిని విస్తరింపజేయడం వలన, అది పాన్-ఇండియా ఉద్యమం అవుతుందని అన్నారు. ప్రతి సెషన్లో 15 మంది వక్తలు కన్వెన్షన్‌లో ఉంచిన తీర్మానాలపై చర్చించారు. రైతుల ఉద్యమం రైతు సంఘాలలో తీసుకువ చ్చిన లోతైన పరివర్తనల గురించి వక్తలు నొక్కి చెప్పారు. సుదీర్ఘ ఉద్యమం కారణంగా ఇప్పటికే అనేక సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, దర్శన్ పాల్, గుర్నామ్ సింగ్ చారుణి, జగ్జిత్ సింగ్ దల్లీవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, శివకుమార్ శర్మ 'కక్కాజీ', యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బంద్‌లో కార్మికులు భాగస్వామ్యం : హేమలత, సీఐటీయూ
రైతాంగం ఇచ్చిన భారత్ బంద్‌లో కార్మికులంతా భాగస్వామ్యం కావాలని సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు కె. హేమలత పిలుపు నిచ్చారు. ఎస్కేఎం జాతీయ కన్వెన్షన్‌లో ఆమె మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్‌లో కార్మికులు ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు పూనుకుంటున్నదని తెలిపారు. కార్మికుల హక్కులను కాలరాసేందుకు చట్టాలు చేశారని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్‌లో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ఖననం చేశారని ఆరోపించారు. కార్మికులకు సామాజిక భద్రత లేదని అన్నారు. కార్మికులు, ప్రజల సంపదను బడా కార్పొరేట్లకు దోచిపెడుతున్నారన్నారు. ఈ క్రమంలో మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మొదటి నుంచి కార్మికులు అండగా ఉన్నారనీ, తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతులు, కార్మికుల ఐక్యత కొనసాగాలని ఆకాంక్షించారు.
బీజేపీ చట్టాలతో ప్రజా పంపిణీ వ్యవస్థ విధ్వంసం
- బంద్‌కు వ్యవసాయ కార్మికుల మద్దతు : ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి వెంకట్
బీజేపీ ప్రభుత్వం తెచ్చిన చట్టాలు రైతులకే కాదు, వ్యవసాయ కార్మికులకు కూడా తీవ్ర హానికరమని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ అన్నారు. సింఘూలో జరిగిన జాతీయ కన్వెన్షన్‌లో ఆయన మాట్లాడుతూ గత తొమ్మిది నెలలుగా జరుగుతున్న ఉద్యమంలో వ్యవసాయ కార్మికులు ప్రత్యక్షంగా భాగస్వాములవుతున్నారని తెలిపారు. దేశంలో 23 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయనీ, 85 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ జీవనాధారమని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దళిత వ్యతిరేకి అని, ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నదని, భూ మాఫియాగా తయారయిందని ఆరోపించారు. అందుకే సెప్టెంబర్ 25 భారత్ బంద్‌లో రైతులతోపాటు వ్యవసాయ కార్మికులు భుజం కలిపి నడుస్తారని అన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు ఒకే వేదిక మీదకి రావడం చారిత్రాత్మకమని అన్నారు.
బంద్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనాలి
- తెలుగు రాష్ట్రాల రైతు నేతలు డిమాండ్
సెప్టెంబర్ నెలాఖరు జరగనున్న భారత్ బంద్‌లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొ నాలని తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలు డిమాండ్‌చేశారు. ఎస్కేఎం జాతీయసదస్సులో తెలంగాణ నుంచి టి. సాగర్, ప్రభు లింగం, కెచ్చల రంగయ్య, అచ్యుత రామారావు, జక్కుల వెంకటయ్య, కె జి రాంచందర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వడ్డే శోభ నాద్రీశ్వరరావు, సూర్య నారాయణ, రావుల వెంకయ్య, ఝాన్సీ పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాల కు వ్యతిరేకంగా, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలనీ, కనీస మద్దతు ధరల చట్టం చేయాలనీ, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ సెప్టెంబర్25న జరుగనున్న భారత్‌బంద్‌లో రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు భాగస్వాములు కావాలని కోరారు.