Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాపై మీడియా సంస్థలు, నిపుణులు, విశ్లేషకుల వెల్లడి
తిరువనంతపురం: దేశంలో కరోనా మహమ్మారి పంజా విసిరిన క్రమంలో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. కరోనా ప్రారంభంలో ముందస్తు చర్యలు తీసుకోకుండా లాక్డౌన్ విధించడంతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లక్షలమంది స్వగ్రామాలకు రివర్స్ మైగ్రేషన్ జరిగింది. వందలాది మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఇక కరోనా సెకండ్‌వేవ్ ఇతర దేశాల్లో తన ప్రతాపాన్ని చూపుతున్నప్పటికీ.. ముందస్తు చర్యలు తీసుకోవడంతో నిర్లక్ష్యం వహించడంతో ఆస్పత్రుల్లో పడకలు లేక, ఆక్సిజన్ కొరత, వైద్యం మందులు లేక వేలాది మంది ప్రజల ప్రాణాలు కోల్పోయారు. మోడీ సర్కారు కరోనా నిర్వహణలో విఫలమైందని ఈ విషయాలు స్పష్టం చేశాయి.
ప్రస్తుతం టీకాల అందించడంలో వేగం పెంచకపోవడం, థర్డ్‌వేవ్ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే సమయంలో కేసులు అధికంగా ఒక్క కేరళలోనే నమోదవుతున్నాయనీ, కేంద్ర బృందాలను పంపుతున్నా మంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తక్కువ చేసిచూపే ప్రయత్నాలు మోడీ సర్కారు చేస్తున్నది. అయితే, దీనికి భిన్నంగా అంతర్జాతీయ పలు మీడియా సంస్థలు, ఎన్జీవోలు, వైద్య నిపుణులు, విశ్లేషకులు కేరళ పరిస్థితులను వివరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మోడీ సర్కారు కరోనా నిర్వహణ విష యంలో కేరళ నుంచి పాఠాలు నేర్చుకోవాలనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రాయిటర్స్ తన విశ్లేషణలో కేరళ తీసుకున్న ముందస్తు చర్యలు కొత్త కేసుల నియంత్రణకు సహాయ పడ్డాయనీ, కరోనా బారినపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు సైతం అందుతున్నాయనీ, మరీ ముఖ్యంగా కరోనా మరణాలను తగ్గించడంలో కేరళ మెరుగైన పనితీరును కనబర్చిందని పేర్కొంది. కరోనా థర్డ్‌వేవ్ అంచనాల నేపథ్యంలో కేంద్రంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కేరళ నుంచి అనేక పాఠాలు నేర్చుకోవాలని తెలిపింది.
ప్రస్తుతం కేరళలో అధిక కేసులు వెగులు చూడటానికి కారణం.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కేసులను ముందుగానే గుర్తించే చర్యలను వేగవంతం చేసిందనే విషయాన్ని తెలియజేస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశంలోని అనేక పెద్ద నగరాల్లో పడకలు, ఆక్సిజన్ కొరత నేపథ్యంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే.. కేరళలో మాత్రం దీనికి విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం అక్కడి ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలే. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిర్వహణలో అనుసరిస్తున్న వ్యూహాలు దేశంలో అతితక్కువ మరణాల రేటును నమోదుచేస్తున్న రాష్ట్రంగా కేరళను నిలపడమే కాకుండా.. దేశంలోనే కేసులను గుర్తించడంలో ప్రథమ స్థానంలో నిలిపింది. వేగవంతమైన కరోనా పరీక్షలు సైతం కేరళ నిర్వహిస్తోందనీ, కరోనా మరణాలను తగ్గించడంలో కేరళ విజయం సాధించిందని ఢిల్లీ జేఎన్‌యూ సోషల్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చీఫ్ రజీబ్ దాస్ గుప్తా అన్నారు. జనాభా పరంగా పొలిస్తే కేసులు గుర్తించడంలో జాతీయ సగటు కంటే రెండు రెట్లు కేరళ ముందుంది. మరణాలు రేటు సైతం ఇక్కడ 0.5 శాతం కాగా, జాతీయ సగటు 1.4 శాతంగా ఉంది. దేశంలో అధిక జనాభా కలిగిన యూపీలో ఇది 1.3 శాతంగా ఉంది.
అక్కడ జరుగుతున్నదేమిటి?
కేరళ ప్రభుత్వం ర్యాపిడ్ టెస్ట్ ఫలితాల నేపథ్యంలో ముందస్తు చికిత్సను ఇంట్లో ఒంటరిగా ఉండి పొందేందుకు అనుమతిస్తుంది. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. ముందుగా ఇంట్లో ఐసోలేషన్ అవుతుండటంతో వైరస్ వ్యాప్తి తగ్గుతుంది. అలాగే, వారికి చికిత్స మందులు, ఆక్సీమీటర్లు, మాస్కులు, సేవలు అందించడం వంటి చర్యలను తీసుకుంటున్నామని పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. తమకు ఒక ప్రత్యేక మోడల్ ఉండటంతో మరణాలను తగ్గించగలిగామని అధికారులు వివరిస్తున్నారు. ఇక రాయిటర్స్ మలప్పురంలో అతిపెద్ద ఆస్పత్రిని సందర్శించినప్పుడు 344 కోవిడ్ పడకలలో నాలుగింట ఒక వంతు ఖాళీగా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సంబంధ చర్యలు తీసుకుంటున్న విషయాన్ని పేర్కొంది. అలాగే గ్రామ స్థాయి నుంచి ఇంటింటికీ తిరిగి కరోనా టెస్టులు ముమ్మరంగా చేయటంవల్లే కేసుల సంఖ్య అధికంగా వస్తున్నదని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. పరీక్షలు సైతం ఇక్కడ 100 మందితో పోలిస్తే యూపీలో 33 జరుగుతుండగా, కేరళలో 86 జరుగుతున్నాయి. ఇక వచ్చే నెల నాటికి రాష్ట్రంలో పెద్దలందరికీ మొదటి డోసు అందుతుందని రాష్ట్ర మంత్రి జార్జ్ తెలిపారు.